భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారుల గుండా పాదచారులు నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నాయి. పాదచారులు రోడ్లపై నడిచి ప్రమాదాల బారిన పడకుండా కాలిబాటలను సుందరీకరిస్తుంటే, స్థానిక దుకాణదారులు మాత్రం ఆ ఫుట్‌పాత్‌లు తమ సొంత జాగాలన్నట్లుగా యథేచ్ఛగా ఆక్రమించి వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఫుట్‌పాత్ స్థలాలను కబ్జా చేస్తూ, వ్యాపార సామగ్రిని, నేమ్స్ బోర్డులు సైతం రోడ్లపైకి వచ్చేలా పెడుతున్నారు. ఈ ఆక్రమణలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, అలాగే ట్రాఫిక్ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా పాదచారులు ఫుట్‌పాత్‌లపై కాకుండా రోడ్లమీదనే నడుస్తూ ప్రమాదాల బారిన పడాల్సిన పరిస్థితులు దాపురించాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్యాలయానికే పరిమితమైన అధికారులు
గతంలో మున్సిపల్ అధికారులు ప్రతిరోజూ మార్నింగ్ వాక్, సాయంత్రపు తనిఖీల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేవారు. మధ్యాహ్నం వేళల్లో సైతం ఫుట్‌పాత్‌లపై జరిగే ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసేవారని, ప్రస్తుత మున్సిపల్ అధికారులు మాత్రం కార్యాలయానికే పరిమితమయ్యారని, ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడం వల్లే ఫుట్‌పాత్‌లను అడ్డగోలు ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని ప్రజలు అంటున్నారు. సుందరంగా మారుతున్న భువనగిరి పట్టణాన్ని ఆక్రమణల అడ్డాగా మారుస్తున్న దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి, తక్షణమే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగింపజేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ భువనగిరిలో దుకాణదారుల నిర్వాకం
ఫ సామగ్రి రోడ్లపైనే పెడుతున్న వ్యాపారులు
ఫ ప్రధాన రహదారుల వెంట పాదచారులకు బాట కరువు


