ఆలేరురూరల్: నిరుద్యోగ యువత ఏడాదిన్నరగా ఎదరుచూస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం అమలులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. 2025 ఏప్రిల్ 15తో దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు రుణాలు మంజూరు చేసే సమయంలో వివిధ రకాల కారణాలతో ప్రభుత్వం ఆ ప్రక్రియను నిలిపివేసింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇటీవల ఈ పథకంపై వివిధ సంక్షేమ శాఖలతో సమీక్షించి నవంబర్ 19 నుంచి రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు కసరత్తు ప్రారంభించారు.
రూ.50 వేల నుంచి
రూ.4 లక్షల వరకు రుణాలు
స్వయం ఉపాధి కల్పనలో భాగంగా రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికై న నిరుద్యోగులకు 70 శాతం నుంచి వంద శాతం రాయితీతో రుణాలు మంజూరు చేయనున్నారు. రూ.50 వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు అందజేస్తారు.
దరఖాస్తులు ఇలా..
రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లాలో 17 మండలాల్లో వివిధ వర్గాలకు చెందిన 38,900 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం గతేడాదిలోనే ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. మొత్తం 7,041 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.50 వేల రుణ యూనిట్లు 2,600 వరకు ఉన్నాయి. బీసీలకు 2,500 యూనిట్లు మంజూరు కాగా 23,578 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు కనీసం 9 మంది పోటీ పడుతున్నారు. ఈబీసీలకు 608 యూనిట్లు మంజూరు కాగా 863 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఫ నవంబర్ 19 నుంచి రుణాలు
ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం
ఫ శాఖల వారీగా అధికారుల కసరత్తు


