భూదాన్‌పోచంపల్లి : మండలంలోని కప్రాయిపల్లి గ్రామంలో శనివారం మద్యపానాన్ని నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాగీరు నర్మదసత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో తీర్మానిస్తూ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా బెల్టుషాపులు నిర్వహించినా, మద్యం విక్రయించినా భారీగా జరిమానా విధిస్తామన్నారు. అంతేకాక చట్టరీత్యా చర్యలు తీసుకొనేందుకు అధికారులకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింహ, ఉపసర్పంచ్ మార్గం వెంకటేశ్, వార్డుసభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.


