చౌటుప్పల్ : ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఓ యువకుడు తన సమీప బంధువైన వృద్ధురాలిని హత్య చేసి బంగారు, వెండి ఆభరణాలతో ఉడాయించాడు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల్లోనే పోలీసులు నిందితుడిని గుర్తించి రిమాండ్‌కు తరలించారు. బుధవారం చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట గ్రామానికి చెందిన మంటిపల్లి యాదమ్మ(70) తన భర్త నుంచి విడిపోయి గత 50ఏళ్లుగా తూప్రాన్‌పేటలో ఒంటరిగానే నివాసం ఉంటుంది. గత నెల 26న రాత్రి యాదమ్మ తన ఇంట్లోనే మృతిచెందగా.. సమీప బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. యాదమ్మ ఒంటిపై చిన్నచిన్న గాయాలు సైతం గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు
కేసు విచారణ చేపట్టిన పోలీసులు ముందుగా పోస్టుమార్టం వివరాలను పరిశీలించారు. అదేవిధంగా హత్య జరిగిన రోజు మృతురాలి ఇంటి పరిసరాల్లోని కాల్‌డేటాతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను గుర్తించారు. ఆ ప్రకారంగా మృతురాలిని తూప్రాన్‌పేట గ్రామానికే చెందిన ఆమె సమీప బంధువైన మంటిపల్లి రాజు హత్య చేసినట్లు నిర్ధారించారు. రాజును బుధవారం అతడి ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తనకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, నెలవారీ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నానని, ఈ నేపథ్యంలోనే తనకు వరుసకు అమ్మమ్మ అయిన యాదమ్మను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనం, బంగారు, వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని స్థానిక కోర్టులో హాజరుపర్చి నల్లగొండ జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
హత్య చేసింది మృతురాలి
సమీప బంధువే
నిందితుడి రిమాండ్


