● ముగ్గురు ప్రయాణికులకు గాయాలు
మోతె : అతివేగంగా ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మోతె మండలం హుస్సేన్‌బాద్ గ్రామ శివారులో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్నంకు వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సును డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో మార్గమధ్యలో మోతె మండలం హుస్సేన్‌బాద్ గ్రామ శివారులో పెట్రోల్ బంక్ వద్ద బుధవారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తాపడింది. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉంగా.. సూరపురెడ్డి విజయకుమారి, జోగు పవన్, ఈశ్వర్‌కు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో 8 మందికి స్వల్ప గాయాలు కాగా.. మిగిలిన ప్రయాణికులు సురక్షింతంగా ఉన్నారు. ప్రయాణికుడు వి. జగదీష్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ రమణ శంకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోతె ఎస్‌ఐ బి. లచ్చిరెడ్డి తెలిపారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ను నిరంతరం కొనసాగించాలి
● రియల్ ఎస్టేట్ వ్యాపారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరస్వామిగౌడ్
సూర్యాపేట : లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) విధానాన్ని నిరంతరం కొనసాగించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంతంగి వీరస్వామిగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రభుత్వం ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాత పద్ధతిలోనే ఎల్‌ఆర్‌ఎస్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఎకరం, రెండు ఎకరాలలోపు ఉన్న భూములకు నాలా కన్వర్షన్ మీదనే ప్లాట్లకు నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం రూ.10వేలు చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు. 22–ఏ నిషేధిత భూముల సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్, రాష్ట్ర కార్యదర్శి కంభంపాటి అంజయ్యగౌడ్, ఆకుల మారయ్య గౌడ్, మల్లయ్యగౌడ్, రాపర్తి జానయ్య, విన్ను, నరేష్, పట్టేటి కిరణ్, మాదిరెడ్డి గోపాల్‌రెడ్డి, సారగండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.


