నిండని చెరువులు..
సీజన్ ముగిసింది..
ఈ వానాకాలంలో 22 శాతం లోటు వర్షపాతం
అత్యధిక లోటు వర్షపాతం
నమోదైన మండలాలు (మి.మీలలో)
మండలం సాధారణం కురిసింది లోటు శాతం
బీబీనగర్ 543.3 275.8 –49
భువనగిరి 610.7 334.8 –45
పోచంపల్లి 552.9 343.9 –38
సాక్షి, యాదాద్రి: ఈ ఏడాది వానాకాలం సీజన్ రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సగటున 22 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. వానాకాలంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఇక వచ్చే యాసంగి సీజన్‌లో సాగు ఎలా ముందుకు సాగుతుందన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది.
జిల్లాలో కురిసింది 414.4మి.మీ. మాత్రమే
సాధారణంగా జిల్లాలో వానాకాలం సీజన్‌లో 530.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 414.4 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. ఇది సాధారణం కంటే 22 శాతం తక్కువ. జిల్లాలోని మొత్తం 17 మండలాల్లో ఏకంగా 12 మండలాలు లోటు వర్షపాతం నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం 5 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో జిల్లాలోని ఏ ఒక్క మండలంలోనూ భారీ వర్షపాతం నమోదు కాలేదు.
బీబీనగర్‌లో అత్యధిక లోటు ..
లోటు వర్షపాతం నమోదైన మండలాల్లో బీబీనగర్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ –49 శాతం లోటుతో జిల్లాలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన మండలంగా నిలిచింది. ఆతర్వాత భువనగిరిలో –45శాతం లోటు వర్షపాతం ఉంది. మూటకొండూర్‌లో –32శాతం, యాదగిరిగుట్టలో –30 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది.
సాధారణ వర్షపాతం నమోదైన మండలాలు..
జిల్లాలోని తుర్కపల్లి, ఆత్మకూర్–ఎం , మోత్కూర్ , అడ్డగూడూర్, గుండాల మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే, సరైన సమయంలో వానలు పడకపోవడం వల్ల ఈ వర్షాలు కూడా తమకు పెద్దగా ఉపయోగపడలేదని రైతులు వాపోతున్నారు.
పంట నష్టాన్ని అంచనా వేసి..
తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి లోటు వర్షపాతం ఉన్న మండలాల్లో పంట నష్టాన్ని అంచనా వేయాలని, ప్రత్యామ్నాయ నీటిపారుదల సదుపాయాలు కల్పించడంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఫ 12 మండలాల్లో తీవ్ర వర్షాభావం
ఫ నిండని చెరువులు, పారని వాగులు
ఫ అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఫ ఇక యాసంగి సాగు ఎలా అని రైతుల్లో ఆందోళన
మూడు నెలల వానాకాలం ముగిసినా ఆశాజనకంగా వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. సీజన్ మొత్తంలో ఒక్క వాగు కూడా పారిన దాఖలాలు లేవు. దీనికి తోడు వ్యవసాయ బావులు, బోరుబావుల్లో సైతం భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. సరైన సమయంలో నీరు అందకపోవడం వల్ల సాగు చేసిన వరి, పత్తి, కంది తదితర పంటల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.


