భువనగిరి(బీబీనగర్): తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అమితా అగర్వాల్ అన్నారు. శనివారం బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో తల్లిపాల వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ వంటి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మీసేవ సెంటర్ల దరఖాస్తుదారులకు రాతపరీక్ష
భువనగిరిటౌన్ : జిల్లాలోని అడ్డగూడూరు, ఆత్మకూరు, మోత్కూరు, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో 8 నూతన మీసేవ సెంటర్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం భువనగిరిలో రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 209 మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేయగా, వారిలో 166 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి పర్యవేక్షణలో ఈ పరీక్ష జరిగింది. ఈడీఎం సాయి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సైదా పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలు జరిపించారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం నిర్వహించారు. సాయంత్రం జోడు సేవలను తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
మూడు అడుగులు పెరిగిన సాగర్ నీటిమట్టం
నాగార్జునసాగర్ : జలాశయం నీటిమట్టం ఒక్క రోజులో మూడు అడుగుల మేర పెరిగింది. శ్రీశైలం జలాశయం విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా సాగర్ జలాశయానికి 81,565 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ వద్ద విద్యుదుత్పాదన చేస్తూ 31,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 900 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00అడుగులు (312.0450టిఎంసీలు)కాగా.. ప్రస్తుతం 516.50 అడుగులు (142.9715 టీఎంసీలు)గా ఉంది.


