యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు.. సంప్రదాయ పద్ధతిలో సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేష పూజలు చేశారు. సింధూరంతో అలంకరించిన శ్రీఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చన జరిపించారు. అలాగే, స్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు.


