సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మంత్రి, ఎమ్మెల్యేల మధ్యన ప్రొటోకాల్ రగడ కొనసాగుతోంది. విభేదాలు కొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులా ఉంటే.. మరికొన్ని చోట్ల బహిరంగంగా విమర్శల చేసుకునే స్థాయికి వెళ్లాయి.. ఈ వివాదాలకు పార్టీ అధిష్టానం చెక్ పెట్టాలని క్యాడర్ కోరుతోంది. ప్రొటోకాల్ వివాదంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులుగా విడిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పొసగని వారు ఇదే అదనుగా గ్రూపులు కడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో బహిరంగంగానే కొట్టుకున్నారు.
● గతంలో మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక విషయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్.. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై పత్రికా ముఖంగా ఆరోపణలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ అభ్యర్థితో కాంగ్రెస్ పొత్తును ఆయన వ్యతిరేకించారు. తనకు తెలియకుండా మోత్కూరకు చెందిన బీఆర్‌ఎస్ వ్యక్తితో ఎలా పోటీకి దిగుతారని అప్పట్లో సామేల్ ప్రశ్నించారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
● ఇటీవల మోత్కురు–ఆలేరు మధ్య రోడ్డు పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి వచ్చి పరిశీలించారు. అనంతరం మంత్రి వెంకట్‌రెడ్డి మోత్కూరు మండలంలో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అంతకు ముందు రోజు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సైతం అదే కుటుంబాన్ని పరామర్శించారు. ఈ రెండు సందర్భాల్లో తనకు సమచారం ఇవ్వలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ తీవ్ర స్థాయిలో ఆరోపణలకు దిగారు. దీంతో పార్టీలో రెండు గ్రూపులుగా మారి పెద్ద ఎత్తున వివాదం రాజకుంది. మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల నియామకంలో సామేల్ తన అనుచరులకే ఇచ్చాడని వివాదం రేగింది.
ద్వితీయశ్రేణి నాయకుల్లో గ్రూపులు
తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఎమ్మెల్యే సామెల్ వర్గం, ఆయనకు వ్యతిరేక వర్గంగా మారి పరస్పర విమర్శలకు దిగుతున్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో రెండు వర్గాలుగా విడిపోయారు. చైర్మన్ ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉండగా, కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు పోటీ వర్గంలో చేరిపోయారు. దీంతో అక్కడక్కడా ఎమ్మెల్యే తీరునచ్చక తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీచేసినట్లు సమచారం. అయితే, ఇటీవలనే గెలిచిన తాము రాజీనామా చేస్తే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన సైతం వారిని వెంటాడుతోంది.
ఫ బహిరంగ విమర్శలతో క్యాడర్‌లో గందరగోళం
ఫ మోత్కూరు మున్సిపల్ కౌన్సిలర్ల రాజీనామా ప్రచారం


