● కోర్టు కేసు హియరింగ్ తేదీలు, కౌంటర్ దాఖలు చేయాల్సిన సమయం వంటి కీలక వివరాలు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా సంబంధిత అధికారులకు నేరుగా అలర్ట్ రూపంలో వెళ్తాయి.
● కేసుల ప్రస్తుత స్థితిగతులు ఏమిటనేది జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులందరికీ ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. దీని ఆధారంగా తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారంలో జాప్యానికి చెక్ పెట్టేందుకు యాదాద్రి జిల్లా యంత్రాంగం అత్యాధునిక సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. పోలీస్ శాఖ మినహా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులను మరింత వేగంగా, పారదర్శకంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘లీగల్ సెల్ మాడ్యూల్’ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం వివిధ శాఖల పరిధిలో సుమారు 1,200కి పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటికి సంబంధించిన డేటా అప్‌లోడ్ ప్రక్రియ జిల్లా కలెక్టరేట్‌లో జోరుగా సాగుతోంది.
ఒకే వేదికపైకి అన్ని శాఖల కేసులు
కలెక్టర్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు, రిట్ పిటిషన్లు, కంటెంప్ట్ వంటి పలు రకాల కేసుల వివరాలను ఈ నూతన సాఫ్ట్‌వేర్ ద్వారా ఒకే వేదికపైకి తీసుకువస్తున్నారు.
ఆధునిక సాంకేతికతే ధ్యేయం
లీగల్ సెల్ మాడ్యూల్ అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే జిల్లాలో ఈ–ఫైలింగ్ విధానం విజయవంతంగా అమలవుతుండగా, త్వరలోనే ఉద్యోగులందరికీ ఫేస్ రికగ్నేషన్ హాజరు విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఆధునిక సాంకేతికతతో పాలనలో మరింత పారదర్శకతను సాధించి, ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు యంత్రాంగం ముందడుగు వేస్తోంది. త్వరలోనే ఈ లీగల్ సెల్ మాడ్యూల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని జిల్లా అధికారులు వెల్లడించారు.
ఫ జిల్లాలో సుమారు 1200 ప్రభుత్వ శాఖల కేసులు
ఫ కలెక్టరేట్‌లో కొనసాగుతున్న డాటా అప్‌లోడ్ ప్రక్రియ
ఫ నూతన సాఫ్ట్‌వేర్‌తో అన్ని కేసులు పరిశీలించే అవకాశం
ఫ కౌంటర్ దాఖలు సమయంలో అధికారులకు మెసేజ్ అలర్ట్


