నేడు మంత్రి కోమటిరెడ్డి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి కోమటిరెడ్డి రాక

Jul 24 2026 11:39 AM | Updated on Jul 24 2026 11:39 AM

మోత్కూరు: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు మోత్కూరు మండలంలో పర్యటించనున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఏలుగు సందీప్‌ కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీటీసీ ఎలుగు పార్వతమ్మ–యాదయ్య దంపతులను మంత్రి పరామర్శించనున్నట్లు చెప్పారు. అనంతరం రాజన్నగూడెం–మోత్కూరు రహదారిని పరిశీలించి ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్ల గౌరవ వేతనం విడుదల

సాక్షి, యాదాద్రి: ఎన్నికల కమిషన్‌ పరిధిలో పనిచేసే బీఎల్‌ఓలు, సూపర్‌ వైజర్ల గౌరవ వేతనం రూ.53.83 లక్షలను ఎన్నికల సంఘం విడుదల చేసినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. వెంకారెడ్డి వెల్లడించారు. జిల్లాలో ఉన్న 566 మంది బీఎల్‌ఓలు, 57 మంది బీఎల్‌ఓ సూపర్‌ వైజర్ల బ్యాంకు ఖాతాల్లో ఈ వేతాలు జమ చేస్తామని తెలిపారు. బీఎల్‌ఓలకు ఆగస్టు 2025 నుంచి మార్చి 2026 వరకు 8 నెలలవి.. నెలకు రూ.500 చొప్పున మొత్తం రూ. 22.64 లక్షలు, ఏప్రిల్‌ 2026 నుంచి జూలై 2026 వరకు 4 నెలలవి.. నెలకు రూ. 1,000 చొప్పున మొత్తం రూ. 22.64 లక్షలు వచ్చినట్లు వివరించారు. బీఎల్‌ఏ సూపర్‌ వైజర్లకు జూలై 2025 నుంచి మార్చి 2026 వరకు 9 నెలలవి నెలకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.5.13 లక్షలు, ఏప్రిల్‌ 2026 నుంచి జూలై 2026 వరకు 4 నెలలవి నెలకు రూ. 1,500 చొప్పున మొత్తం రూ. 3.42 లక్షలు వచ్చినట్లు తెలిపారు.

నేడు విద్యా సంస్థల బంద్‌

భువనగిరి: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం విద్యా సంస్థల బంద్‌ నిర్వహించనున్నట్లు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సురుంగ చందు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బంద్‌కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. నీట్‌ పేపర్‌ లీకేజీ పై ఢిల్లీలో జరుగుతున్న నిరసనలో భాగంగా యువత, విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్‌టీఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యామ్నాయంగా మునగ సాగు మేలు

యాదగిరిగుట్ట రూరల్‌ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మునగ సాగు చేయడం మేలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని డీఆర్‌డీఓ నాగిరెడ్డి సూచించారు. గురువారం యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో తడి, పొడి చెత్తలతో పాటుగా, హానికరమైన, ప్రత్యేక జాగ్రత్త కలిగిన చెత్తలను సేకరించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ నవీన్‌ కుమార్‌, తహసీల్దార్‌ గణేష్‌ నాయక్‌, ఎంపీఓ దినకర్‌, ఏపీఓ నర్సయ్య, ఈసీ రాజశేఖర్‌, పీఆర్‌ఏఈ రాకేష్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

త్వరలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు పూర్తి

మోత్కూరు : త్వరలో మిషన్‌భగీరథ పైప్‌లైన్‌ పనులు పూర్తి చేయాలని మోత్కూరు మున్సిపల్‌ కమిషన్‌ గోల్కొండ నర్సయ్య సూచించారు. మోత్కూరు పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై సాగుతున్న రోడ్డు మరమ్మతుల కారణంగా డ్యామేజ్‌ అయిన మిషన్‌ భగీరథ పైపు లైన్‌ ను గురువారం మిషన్‌ భగీరథ డీఈ నరసింహారావుతో కలిసి ఆయన పరిశీలించారు. వారి వెంట మిషన్‌ భగీరథ ఏఈ నితిన్‌రెడ్డి, మున్సిపల్‌ వాటర్‌ సప్లయ్‌ ఇన్‌చార్జ్‌ నరసింహాచారి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement