యాదగిరిగుట్ట: విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని దేవాదాయశాఖ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఆమె గురువారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన వసతి కల్పించడం అధికారుల బాధ్యత అని సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలన్ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, విద్యార్థినుల ఆరోగ్యం, విద్య, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వసతి గృహంలోని విద్యార్థినుల విశ్రాంతి గదులు, భోజనశాల, వంటగది, నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, నూనె తదితర వంట సరుకులు, కూరగాయల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత, విద్యుత్ సదుపాయం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట తహసీల్దార్ గణేష్ నాయక్, ఎంపీడీఓ నవీన్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, బాలికల హాస్టల్ అధికారిని సోని తదితరులున్నారు.
ఫ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ


