సాక్షి యాదాద్రి : రెడ్ క్రాస్ ద్వారా చేసే రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానమని అదనపు కలెక్టర్లు వెంకారెడ్డి, భాస్కర్ రావు పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులతో పాటు సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒత్తిడితో కూడిన ఉద్యోగ బాధ్యతల మధ్య సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి చొరవతో ఉద్యోగులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ విద్యానగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ బృందం నిర్వహించిన ఈ శిబిరంలో 53 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ రావు, డీఆర్‌ఓ జయమ్మ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కృతిక, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, టీఎన్జీవోస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, భగత్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, రెడ్ క్రాస్ ప్రతినిధులు మహేందర్ రెడ్డి, బాలాజీ, ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు స్వాతి పాల్గొన్నారు.


