మిర్యాలగూడ అర్బన్: విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో నిద్రిస్తున్న అమ్మమ్మతో సహా మనువడు, మనవరాలు ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలాల్‌వాడలో రేకుల ఇంటిలో నివాసముంటున్న చంద్రకళ(50) ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన కుమార్తె పిల్లలైన లక్ష్మణ్(16), ప్రణతి(14)లను తన వద్దే ఉంచుకుని చదివిస్తోంది. గురువారం రాత్రి వీరంతా నిద్రిస్తున్న క్రమంలో ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. కొద్ది సేపటికే ఇంటిలోని వస్తువులన్నింటికీ మంటలు అంటుకున్నాయి. గమనించిన ఇంటిచుట్టుపక్కల వారు బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నీళ్లను చల్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ లోగా మంటలు ఎక్కువై ఇంట్లోని గ్యాస్ సిలిండర్ అంటుకుని ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న చంద్రకళ, లక్ష్మణ్, ప్రణతి మంటల్లో సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎస్పీ కె.రాజశేఖర రాజు, వన్‌టౌన్ సీఐ నాగభూషణరావు, ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీనివాస్, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ యాదగిరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
నేడు భర్త నెలమాసికం.. అంతలోనే విషాదం
చంద్రకళ భర్త సైదులు పదేళ్ల క్రితం పక్షవాతంతో మంచాన పడగా ఆమెనే కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చింది. నెల క్రితం భర్త మరణించడంతో శనివారం నెలమాసికం జరగాల్సి ఉండగా.. ఇందుకోసం చంద్రకళ ఇల్లుకు సున్నం వేసి సిద్ధం చేసుకుంది. ఇదిలా ఉండగా తన పెద్ద కుమార్తె ధనమ్మకు వివాహమైన కొన్నేళ్లకు ఆమె భర్త (అల్లుడు) మరణించడంతో కుమార్తెను చేరదీసి ఆమె పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలను తన వద్దే ఉంచుకుని చదివిస్తోంది. ధనమ్మ ఇళ్లల్లో పని చేసేందుకుగాను నాలుగు రోజుల క్రితమే పూణే వెళ్లగా.. ఈలోపే చంద్రకళతోపాటు ఆమె మనవడు, మనవరాలు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పేలిన గ్యాస్ సిలిండర్
ఇంట్లో నిద్రిస్తున్న అమ్మమ్మతో సహా
మనువడు, మనవరాలు సజీవ దహనం
మిర్యాలగూడలోని
కలాల్‌వాడలో ఘటన
విచారణ చేస్తున్నాం
కలాల్‌వాడలో జరిగిన అగ్ని ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించాం. పూణేలో ఉన్న చంద్రకళ కుమార్తె ధనమ్మ వచ్చిన తరువాత ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడతాం. ప్రస్తుతం తమ ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించాం.
– డీఎస్పీ రాజశేఖర రాజు
క్షణాల్లో మంటలు వ్యాపించాయి
అర్ధరాత్రి సమయంలో మంటలు రావడంతో ఇంటి పక్కన వారి సమాచారంతో ఇక్కడికి వచ్చాను. వచ్చే సరికి మంటలు భారీగా వస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు చాలా ప్రయత్నం చేశాం. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల ధాటికి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ముగ్గురు అందులోనే సజీవ దహనమయ్యారు.
– రమేష్, కలాల్‌వాడ


