కొండమల్లేపల్లి : వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోటు ఆందోళన కలిగిస్తోంది. కొండమల్లేపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోట్ల జగదీష్, శ్రీలక్ష్మి దంపతుల 13 సంవత్సరాల కుమారుడు కోట్ల జతిన్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో ఆడుకొని స్థానిక చౌరస్తాలో ఉన్న తమ ఇంటికి వచ్చి నీళ్లు తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నవయస్సులోనే గుండెపోటుతో బాలుడు మృతిచెందడం స్థానికులకు కంటతడి పెట్టించింది.
అదుపుతప్పి
కారును ఢీకొట్టిన లారీ
చిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఓ కారు నార్కట్‌పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఆ వెనకే వస్తున్న లారీ అదుపుతప్పి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డివైడర్‌కు ఢీకొని హైవేపై నిలిచిపోయింది. ప్రయాణికుడు కారులో ఇరుక్కుపోగా స్థానికులు కారు డోర్లు తెరిచి బయటికి లాగారు. ఈ ప్రమాదంతో కారు, లారీ హైవేపై నిలిచిపోవటంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది.
విద్యుత్ సిబ్బందిపై దాడి
కేసులో ముగ్గురికి జైలు
వలిగొండ : విద్యుత్ సిబ్బందిపై దాడి చేసిన కేసులో ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం రామన్నపేట కోర్టు తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండకు చెందిన కళ్లెం నరేష్, బల్లెపు కృష్ణ, పులిగిళ్లకు చెందిన వేముల నర్సింగ్ రావు ముగ్గురు 2003లో వలిగొండలో విద్యుత్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈమేరకు అప్పటి ఎస్సై ప్రభాకర్ వీరిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువైనందున శుక్రవారం రామన్నపేట కోర్టు జడ్జి సబితా ఈ ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు, రూ.11వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.
బాలికపై యువకుడి
లైంగిక దాడి
● నిందితుడిపై పోక్సో కేసు నమోదు
కేతేపల్లి: కేతేపల్లి మండలంలో మైనర్ బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన బాలిక కేతేపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వారం రోజుల క్రితం వచ్చింది. ఈక్రమంలో గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన దుర్గం కమలాకర్ అనే యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కేతేపల్లి ఎస్‌ఐ సతీష్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతుండగా, శుక్రవారం ఉదయమే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నల్లగొండలోని సఖి కేంద్రానికి తరలించినట్లు తెలిసింది.


