హక్కుల నేత మరణం తీరని లోటు | - | Sakshi
Sakshi News home page

హక్కుల నేత మరణం తీరని లోటు

Jun 6 2026 1:05 AM | Updated on Jun 6 2026 1:05 AM

హక్కుల నేత మరణం తీరని లోటు

మిర్యాలగూడ: హక్కుల నేత సుబ్బారావు మృతి తీరని లోటని తెలంగాణ ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతరెడ్డి సుధాకర్‌రెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు విమలక్క, అమర్‌ అన్నారు. ఈనెల 4న తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందిన పొన్నూరు సుబ్బారావు భౌతికకాయాన్ని వారు శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా హక్కుల కోసం దళితుల, కార్మికుల, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారన్నారు. వనరుల పరిరక్షణకు నిరంతరం శ్రమించిన మేధావి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిగా, కళాశాల అధ్యాపకుడిగా నాలుగు దశాబ్దాలుగా పనిచేసి అనేక మంది విద్యార్థులను ప్రజాస్వామ్య వక్తలుగా తీర్చిదిద్దిన ప్రజాస్వామ్యవాది సుబ్బారావు అని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఇచ్చే ఘనమైన నివాళులని తెలిపారు.

మెడికల్‌ కళాశాలకు అప్పగించిన

సుబ్బారావు భౌతికకాయం

సుబ్బారావు(92) భౌతికకాయాన్ని అశృనయనాల మధ్య శుక్రవారం ఉదయం 8గంటలకు అంబులెన్స్‌లో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. తన భౌతికకాయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా అప్పగించాలని సుబ్బారావు చివరి ఆకాంక్ష మేరకు అభిమానులు, శిష్య బృందం మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. నినాదాలు చేస్తూ అంతిమ వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, అమర్‌, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతరెడ్డి సుధాకర్‌రెడ్డి, కస్తూరి ప్రభాకర్‌, వేనేపల్లి పాండురంగారావు, మహబూబ్‌అలీ, ఖాదర్‌, అంబటి నాగయ్య, డాక్టర్‌ రాజు, కుటుంబసభ్యులు రమేష్‌, అజయ్‌, కిరణ్మయి, నీరజ, నజీర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement