ప్రజలకు భరోసా కల్పించాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు భరోసా కల్పించాలి : ఎస్పీ

Jun 6 2026 1:05 AM | Updated on Jun 6 2026 1:05 AM

వలిగొండ : వివిధ సమస్యలపై స్టేషన్లకు వచ్చే ప్రజలకు పోలీసులు భరోసా కల్పించి పోలీస్‌ శాఖపై నమ్మకం పెంచాలని ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం ఆయన వలిగొండ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. రౌడీ షీటర్ల కదలికలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి సమీక్షించి దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. అర్హత ఉన్న ఫిర్యాదులకు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నారు. పెట్రోలింగ్‌, ప్రజా ఫిర్యాదులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట చౌటుప్పల్‌ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ యుగంధర్‌, సిబ్బంది ఉన్నారు.

వైభవంగా ఊంజల్‌ సేవ

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయంలో పూజలను జరిపించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన పూజలు నిజాభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్రనామార్చన, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి.

Advertisement
 
Advertisement
Advertisement