యాదగిరిగుట్టలో 115 రిజిస్ట్రేషన్లు | - | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టలో 115 రిజిస్ట్రేషన్లు

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువ పెంచింది. ఈ రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి ఎగబడ్డారు. యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో గురువారం 115 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. చివరి రోజు రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగానే అయ్యిందని సబ్‌ రిజిస్టార్‌ ఖాదర్‌ పాషా వెల్లడించారు. క్రయవిక్రయదారులకు ఇబ్బందులు కలుగకుండా సజావుగా రిజిస్ట్రేషన్లు పూర్తైనట్లు పేర్కొన్నారు.

18ప్రాంతాల్లో మోస్తరు వర్షం

అత్యధికంగా వలిగొండలో 36.3 మి.మీ. వర్షపాతం

భువనగిరిటౌన్‌ : జిల్లా వ్యాప్తంగా గురువారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలను తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ వెల్లడించింది. జిల్లాలోనే అత్యధికంగా వలిగొండ మండల కేంద్రంలో 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బొమ్మలరామారంలో 34.0 మి.మీ, ఇదే మండలంలోని మర్యాలలో 26.8 మి.మీ చొప్పున మోస్తరు వర్షం కురిసింది. మోత్కూర్‌లో 9.8 మి.మీ, తుర్కపల్లి మండలం మన్నెవారి తుర్కపల్లిలో 9.0 మి.మీ, ఆత్మకూర్‌లో 5.3 మి.మీ, వలిగొండ మండలం వెంకట్‌పల్లిలో 5.0 మి.మీ, మోత్కూర్‌ మండలం దత్తప్పగూడెంలో 4.0 మి.మీ వర్షం కురిసింది. భువనగిరి మండలం హన్మాపూర్‌, అడ్డగూడూరులలో 3.5 మి.మీ చొప్పున, చౌటుప్పల్‌, నారాయణపూర్‌లలో 3.3 మి.మీ చొప్పున, నారాయణపూర్‌ మండలం జనగాంలో 3.0 మి.మీ, భువనగిరి కలెక్టరేట్‌ పరిసరాల్లో 2.5 మి.మీ మేర వర్షం పడింది. పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌, ఆలేరు మండలం కొలనుపాకలో 1.5 మి.మీ చొప్పున, షారాజీపేటలో 1.0 మి.మీ, గుండాలలో అత్యంత తక్కువగా 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

తుర్కపల్లి: వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌ గౌడ్‌ విమర్శించారు. గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ కనుసన్నల్లోనే జిల్లాలోమట్టిదందా కొనసాగుతోందని ఆరోపించారు. సమావేశంలో కొక్కొండ లక్ష్మీనారాయణ, చాంద్‌పాషా,యాట పెంటయ్య, కందుకూరి చెల్మయ్య, సత్యనారాయణ, వెంకటేశం, అకుల రమేష్‌, రమేష్‌ నాయక్‌, భిక్షపతి, భాను పాల్గొన్నారు.

యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, బాల భోగం వంటి పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు.

Advertisement
 
Advertisement
Advertisement