నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (ఎన్‌డీసీఎంఎస్)ను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 డీసీఎంఎస్‌లను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జీఓ త్వరలో విడుదల కానున్నట్లు తెలిసింది. ఎన్‌డీసీఎంఎస్‌కు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు, రామన్నపేట, నిడమనూరు, హుజూర్‌నగర్, సూర్యాపేట, దేవరకొండలో విలువైన గోదాములు, ఖాళీ స్థలాలను కొన్ని విక్రయించినప్పటికీ ఇంకా కొన్ని ఆస్తులు నేటికీ మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్‌డీసీఎంఎస్ నాలుగు కోట్ల రూపాయల లాభాల్లో ఉంది. విత్తనాలు, ఎరువుల విక్రయం ద్వారా రైతులకు సేవలందిస్తూ సంస్థ లాభాలను గడిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం భువనగిరిలో సంఘానికి చెందిన గోదాములు, ఖాళీ స్థలాన్ని విక్రయించగా స్టేషన్ రోడ్డులో దుకాణాల సముదాయం ప్రస్తుతం ఉంది. ఇందులో 13 మడిగెలు ఉన్నాయి. 1987వ సంవత్సరం నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలోని సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి గ్రేడింగ్, మార్కెటింగ్, ఎరువులు, విత్తనాలను విక్రయిస్తున్నారు. అప్పట్లో ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్‌డీసీఎంఎస్‌లో 120 మంది ఉద్యోగులు పని చేసేవారు. సహకార సంఘాలు రావడంతో ఎన్‌డీసీఎంఎస్‌పై ఉన్న బాధ్యతలను ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చింది. సంఘానికి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను విక్రయించి నష్టపరిహారం చెల్లించి ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ఎన్‌డీసీఎంఎస్‌తో ప్రయోజనం లేదని గుర్తించి వ్యయభారం తగ్గించుకునేందుకు మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్‌డీసీఎంఎస్‌ను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయడంతో సంస్థకు ఉన్న ఆస్తులు మార్క్‌ఫెడ్ పరం కానున్నాయి. మార్క్‌ఫెడ్‌లో విలీనమైతే రైతులకు మరిన్ని సేవలు అందించడంతోపాటు సంస్థ మరిన్ని వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంటుంది. దీంతో సంస్థ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది.
ఫ రూ.కోట్లాది విలువ గల ఆస్తులు ఇక మార్క్‌ఫెడ్ చేతిలోకి
ఫ రైతులకు మెరుగైన సేవలు అందే అవకాశం


