తిప్పర్తి : ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఊహించని బహుమతి ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో ఇచ్చిన మాటను నెరవేర్చారు. ఈ మేరకు తిప్పర్తి మండలం నుంచి 530కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నెల విమానంలో విహార యాత్రకు విశాఖపట్నం తీసుకెళ్లారు. తిప్పర్తి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల నుంచి ఏశబోయిన శ్రీజ, మానస, నరాల రజిత, వి. చరణ్, లహరిక, కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల నుంచి కె. వర్షిత, మధుశ్రీ, టి. వైశాలి, ప్రణీత, ఎం. నందిని, బాలికల ఉన్నత పాఠశాల నుంచి బుర్రి శ్రీనిధి, సింగం స్రవంతి, తిప్పర్తి మోడల్ స్కూల్ నుంచి శ్రావ్య మొట్టమొదటిసారి విమానం ఎక్కారు.
విశాఖపట్నం టూర్‌కు విద్యార్థులు
ఈ 13మంది విద్యార్థులు గత నెల 22న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో బయల్దేరి విశాఖపట్నంలో దిగారు. రెండు రోజుల పాటు అరకు, బొర్రా గుహలు, సింహచలం, ఆర్‌కే బీచ్ తదితర ప్రదేశాలను చూసి తిరిగి వచ్చారు. తాము విమానం ఎక్కుతామని కలలో కూడా ఉహించలేదని, భూమి పైనుంచి విమానాన్ని చూసి ఆనందపడే తమకు నిజమైన విమానం ఎక్కడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుంటే ఇంకా ఎన్నో దేశాలు తిరగవచ్చని అనిపించిందన్నారు. తమలాగే మరికొంత మంది పేద విద్యార్థులను కూడా ప్రోత్సహించాలని మంత్రిని విద్యార్థులు కోరారు.
నిజ జీవితంలో విమానం ఎక్కుతానని కలలో కూడా ఉహించలేదు. అసలు విమానం దగ్గర నుంచి చూస్తానని అనుకోలేదు. అలాంటింది నేరుగా విమానంలో ప్రయాణించడం మాటల్లో చెప్పలేకపొతున్నా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాలాంటి పేద విద్యార్దులను ప్రోత్సహించడం సంతోషంగా ఉంది.
– ఏశబోయిన శ్రీజ, తిప్పర్తి ఉన్నత పాఠశాల
చదువుతోనే ఏదైనా సాధించవచ్చని ఈ విమాన ప్రయాణం ద్వారా తెలుసుకున్నాను. పదో తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచాను. కష్టపడి చదివితే ఉన్నత స్థాయిలో ఉండవచ్చని విమాన ప్రయాణం ద్వారా అర్ధమైంది. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నాకు బాసర ఐఐఐటీలో సీటు వచ్చింది. – బుర్రి శ్రీనిధి,
బాలికల ఉన్నత పాఠశాల, తిప్పర్తి
బొర్రా గుహల్లో తిప్పర్తి మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
విమానాశ్రయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు
ఫ ఉత్తమ మార్కులు సాధించిన
విద్యార్థులకు విమాన ప్రయాణం
కల్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు
చేరుకోవాలనే స్ఫూర్తి
కలిగిందన్న విద్యార్థులు


