మిర్యాలగూడ : ప్రజల హక్కుల కోసం దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేసిన మానవ హక్కుల నేత పొన్నూరు సుబ్బారావు(92) తుది శ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆయన అనారోగ్య కారణాలతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందారు. 1934 జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో జన్మించిన సుబ్బారావు తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1956లో మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా చేరారు. అనంతరం 1971లో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ప్రమోషన్ పొందిన ఆయన 1982లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలో చైతన్య పాఠశాలను స్థాపించి అనేక మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన సుబ్బారావు మార్క్సిస్టు భావజాలంలో, శాసీ్త్రయ దృక్ఫదంతో మిర్యాలగూడ ప్రాంత ప్రజాస్వామిక ఉద్యమాలలో కీలకపాత్ర పోషించారు. ప్రజాస్వామిక వాదులతో కలిసి చైతన్య సమాఖ్యను స్థాపించి అనేక సామాజిక ఉద్యమాలకు పునాదులు వేశారు. మానవ హక్కుల నేతలు అజంఅలీ, బాలగోపాల్‌లతో కలిసి రెండున్నర దశాబ్ధాలుగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధితుల పక్షాన నిలబడ్డారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.. కాగా పెద్ద కుమారుడు గతంలోనే మృతిచెందాడు.
నాకు ఇంగ్లిష్ బోధించారు :
మాజీ మంత్రి జానారెడ్డి
పొన్నూరు సుబ్బారావు మృతి తనకు తీరని లోటని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. సుబ్బారావు మృతిచెందిన విషయం తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులను జానారెడ్డి ఫోన్‌లో పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. పొన్నూరు సుబ్బారావు వద్ద వద్ద శిష్యరికం పొందే అవకాశం లభించడం తన జీవితంలో మరిచిపోలేనని జానారెడ్డి అన్నారు. తాను మిర్యాలగూడ ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10వ తరగతులు చదివినప్పుడు పొన్నూరు సుబ్బారావు తనకు ఇంగ్లిష్ పాఠాలు బోధించారని జానారెడ్డి గుర్తుచేసుకున్నారు.
నేడు కామినేని ఆస్పత్రికి
భౌతికకాయం అప్పగింత
సుబ్బారావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యుల అంగీకారంతో శుక్రవారం ఉదయం 8గంటలకు నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి అప్పగించనున్నారు. ఆయన భార్య సత్యవతి 2003 మే నెలలో, పెద్ద కుమారుడు శరత్ 2019 సెప్టెంబర్‌లో మృతిచెందగా వారి భౌతికకాయాలను సైతం అప్పట్లో మెడికల్ కళాశాలలకు అప్పగించారు.
సుబ్బారావు మృతి పట్ల పలువురి సంతాపం
ప్రముఖ విప్లవ కవి వరవరరావు, ప్రజా కవి గోరటి వెంకన్న సుబ్బారావు కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి సంతాపం ప్రకటించారు. అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్సీలు కెతావత్ శంకర్‌నాయక్, కోదండరాం, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీషనవీన్, మానవ హక్కుల నేత జీవన్‌కుమార్, సీడీ.రవికుమార్, డాక్టర్లు రాజు, మువ్వా రామారావు, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, గురవయ్య, మోహన్, అంబటి నాగయ్య, వేనేపల్లి పాండురంగారావు, కస్తూరి ప్రభాకర్, రామయ్య, సుధాకర్, రమేష్, అజయ్, కిరణ్మయి, నీరజ, నజీర్, ఉదయ్ తదితరులు సుబ్బారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఫ అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసిన పొన్నూరు సుబ్బారావు
ఫ మానవ హక్కుల కోసం
దశాబ్దాలుగా పోరాటం


