భువనగిరి : మృతిచెందిన గర్భిణి మెడలోని బంగారు పుస్తెలతాడు మాయమైన ఘటన భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గురువారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం వర్కట్‌పల్లి గ్రామానికి చెందిన దాసరి నాగరాజు భార్య సుశ్మిత(36) 8 నెలల గర్భిణి. గురవారం తెల్లవారుజామున ఆమెకు దమ్ము రావడంతో కుటుంబ సభ్యులు వలిగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గర్భిణిని పరిశీలించి అప్పటికే ఆమెతో పాటు కడుపులోని బిడ్డ కూడా మృతిచెందినట్లు తెలిపారు.
కనిపించని పుస్తెలతాడు..
సుశ్మిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలోని మార్చురీకి తరలించే క్రమంలో ఒంటిపై బంగారు ఆభరణాలను పరిశీలించుకోవాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరిశీలించగా. మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు కనిపించలేదు. దీంతో పోస్టుమార్టం నిర్వహించొద్దని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాల పరిశీలన..
పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అనంతరం వార్డుల్లో ఉన్న సిబ్బందిని, సైక్యూరిటీని విచారించారు. మృతదేహాన్ని వార్డు నుంచి మార్చురీకి మార్చే క్రమంలో పుస్తెలతాడును ఆస్పత్రి సిబ్బందే మాయం చేసి ఉండొచ్చని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, ఒకవేళ ఆస్పత్రి సిబ్బందే పుస్తెలతాడు దొంగిలించినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.
ఫ పోస్టుమార్టం నిర్వహించకుండా
అడ్డుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు
ఫ న్యాయం చేయాలని ధర్నా
ఫ భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఘటన


