యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని కర్ణాటకలోని భీమ కంటే మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామిజీ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భవానీశంకర్ ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు సురేంద్రచార్యులు సమక్షంలో అర్చక బృందం ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను రఘు వరేంద్ర తీర్థ స్వామిజీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. స్వామిజీకి అర్చక బృందం వేద పారాయణం నిర్వహించారు. ఈఓ భవానీశంకర్ లడ్డూ ప్రసాదంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.


