హుజూర్‌నగర్ : ఒక వ్యక్తిని నమ్మించి దారుణంగా హత్య చేసిన నలుగురు హంతకులకు జీవిత ఖైదు విధిస్తూ హుజూర్‌నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ పి.శివరామ్ ప్రసాద్ శుక్రవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన చార్ల వెంకటేశ్వర్లు ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అతని సామాజిక వర్గానికి చెందిన ఒక అవివాహిత యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అంతకు మునుపు అదే గ్రామానికి చెందిన రెడపంగు కోటేశ్వరరావు అనే యువకుడు సదరు యువతితో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. తదుపరి అతను కంప్యూటర్ శిక్షణ కొరకు హైదరాబాద్ వెళ్లగా సదరు యువతి చార్ల వెంకటేశ్వర్లుకు దగ్గరై అతనితో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన తన మిత్రులైన రెడపంగు శ్రీహరి, పెరిమి మహేష్, కొత్తపల్లి నాగసైదులు ద్వారా తెలుసుకున్న కోటేశ్వరరావు గ్రామానికి చేరుకుని తన మిత్రులతో సంప్రదించి ఎలాగైనా వెంకటేశ్వర్లును హత్య చేయడానికి తనతో సహకరించమని కోరగా అందుకు వారు అంగీకరించారు. హత్య చేయడానికి నలుగురు కలిసి పథకం పన్నారు.
మత్తు మందు కలిపిన కూలిడ్రింక్ తాపించి..
2016 ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో చార్ల వెంకటేశ్వర్లు తన ఇంటి వద్ద ఉండగా రెడపంగు శ్రీహరి అతనికి ఫోన్ చేసి రామాపురం నుంచి మేళ్లచెరువు వెళ్లి ఫ్రిజ్ తీసుకు రావడానికి ఆటో కిరాయికి కావాలని అడగగా అందుకు వెంకటేశ్వర్లు అంగీకరించి ఆటోను కిరాయికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో శ్రీహరి మత్తు మాత్రలు కలిపిన కూల్ డ్రింక్ తన వద్ద ఉంచుకొని మేళ్లచెరువుకు బయలు దేరారు. వీరి ఆటోను రెడపంగు కోటేశ్వరరావు, పెరిమి మహేష్, కొత్తపల్లి నాగ సైదులు మోటార్ సైకిల్‌పై వెంబడించారు. మేళ్లచెరువులో శ్రీహరి బీరు తాగగా చార్ల వెంకటేశ్వర్లుకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్‌ను తాపించాడు. తిరిగి రామాపురం వస్తుండగా మార్గమధ్యంలో రేవూరు గ్రామ శివారులో నిర్మానుష్య ప్రదేశంలో తనకు వాంతి వస్తున్నదనే నెపంతో శ్రీహరి ఆటోని ఆపమని కోరగా వెంకటేశ్వర్లు రోడ్డు పక్కన ఆటో ఆపాడు.
మర్మాంగాలపై దాడిచేసి..
ఇదే అదునుగా భావించిన రెడపంగు కోటేశ్వరరావు, పెరిమి మహేష్, కొత్తపల్లి నాగ సైదులు ఆటో వద్దకు వచ్చి మత్తులో ఉన్న వెంకటేశ్వర్లను బలవంతంగా ఎన్‌ఎస్‌పీ కాల్వ వద్దకు తీసుకువెళ్లి రాళ్లతో అతని మర్మాంగాలపై, శరీరంలో ఇతర భాగాలపై తీవ్రంగా కొట్టారు. తాడును మెడకు బిగించి అందరూ కలిసి హత్య చేశారు. అనంతరం శవాన్ని, ఆటోను భీమా సిమెంట్ క్వారీ వద్దవదిలేసి వెళ్లిపోయారు. వెంకటేశ్వర్లు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, రాత్రి కావడంతో తండ్రి లక్ష్మీపతి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరుసటి రోజు ఉదయం రేవూరుకు చెందిన రైతులు భీమా సిమెంట్ ఫ్యాక్టరీ క్వారీ వద్ద ఆటో ఉన్నదని దాని పక్కన యువకుడి శవం పడి ఉన్నదని పలువురికి చెప్పగా ఆ విషయం తెలుసుకున్న లక్ష్మీపతి అక్కడికి వెళ్లి శవం తన కుమారుడిదేనని నిర్ధారించుకొని మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
అనుమానాస్పద మృతి కింద కేసు
అప్పటి హెడ్ కానిస్టేబుల్ సైదా అనుమానాస్పద కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో రెడపంగు కోటేశ్వరరావు, రెడపంగు శ్రీహరి, పెరిమి మహేష్, కొత్తపల్లి నాగ సైదులు హత్యకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో ఆ నలుగురిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసి అప్పటి కోదాడ రూరల్ సీఐ రవి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల విచారణ అనంతరం నలుగురిపై నేరం నిరూపణ కావడంతో హుజూర్‌నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ పి.శివరామ ప్రసాద్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితులు ఒక్కొక్కరు రూ.వెయ్యి జరిమానా చెల్లించాలని చెల్లించని పక్షంలో 15 రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బొబ్బ కోటిరెడ్డి వాదించగా సాక్షులను ప్రవేశపెట్టడంలో లైజన్ ఆఫీసర్లు ఆరుట్ల వెంకన్న, శ్రీకాంత్ సహకరించారు.
వివరాలు వెల్లడించిన పోలీసులు


