రాజాపేట : మేత కోసం వచ్చి తప్పిపోయి గ్రామం శివారుకు వచ్చిన చుక్కల దుప్పి కుక్కల దాడిలో మృతి చెందినట్లు ఫారెస్టు అధికారులు శుక్రవారం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామం శివారులో పక్కనే ఉన్న అడవి నుంచి మేత మేయడం కోసం మూడు చుక్కల దుప్పులు వచ్చాయి. వీటిని గమనించిన కుక్కలు వాటిని తరమడింతో మూడింటిలో రెండు పారిపోగా ఒక దుప్పిపై దాడి చేశాయి. దీంతో ఆ దుప్పి మృతి చెందినట్లు ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు శేఖర్‌రెడ్డి, శాలిని, బీట్ ఆఫీసర్ మల్లేశం తెలిపారు. దుప్పికి మండల పశువైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు.
నిజాయితీ చాటుకున్న
ఆటో డ్రైవర్
నకిరేకల్ : నకిరేకల్‌లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. శుక్రవారం నకిరేకల్‌లోని శ్రీనివాసా ఫంక్షన్ హాల్‌కు వెళ్తుండగా ఆటో డ్రైవర్ సుదర్శన్‌కు దారిలో నల్ల బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో ఆరు తులాల బంగారం అభరణాలు, బ్యాంక్ లాకర్ కీస్ ఉన్నట్లు గుర్తించారు. సదరు ఆటో డ్రైవర్ సుదర్శన్ ఆ బ్యాగ్‌ను నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో ఆ బ్యాగ్ పోగొట్టుకున్న బ్యాంక్ ఉద్యోగి శ్వేత పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడే సదరు మహిళకు ఆ బ్యాగ్‌ను ఆటో డ్రైవర్ సుదర్శన్ అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. దీంతో అతడని పోలీసులు అభినందించారు.
విద్యుదాఘాతానికి
బాలుడు బలి
● మామిడి కాయలు కోస్తుండగా ప్రమాదం
మద్దిరాల : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన సంఘటన మద్దిరాల మండలం గుట్టకింది తండా ఆవాసం షేట్‌రాం తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం షేట్‌రాం తండాకు చెందిన నేనావత్ రాజు విజయ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు సంతోష్(16) మండలంలోని చిన్ననెమిలా ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల 10వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో చిన్ననెమిలా గ్రామానికి చెందిన దబ్బేటి సురేష్ అనే వ్యక్తి.. సంతోష్‌తో పాటు మరి కొందరిని ఐదు రోజులుగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన సంపెల్లి వెంకటేశ్వర్‌రావు మామిడితోటలో కాయలు కోసేందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సంతోష్ మామిడి తోటలో మామిడి కాయలు కోస్తున్నాడు. అతడు కోస్తున్న చెట్టు పైనుంచి వెళ్తున్న విద్యుత్ లైన్‌ను గమనించని సంతోష్ వాటికి తగిలి విద్యుత్‌షాక్‌కు గురై కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన ట్లు వైద్యులు ధ్రువీకరించారు. మామిడితోట మధ్యలో నుంచి 11కేవీ విద్యుత్ వైర్లు ఉన్నా చెట్లకొమ్మలు తొలగించడంలో విద్యుత్ అధికా రుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఎల్‌సీ తీసుకోకుండా తోట యజమాని, కౌలుదారు కాయలు కోయించడంతో బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.


