వాహనదారుడిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు
ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలంలో వాహనదారుడిపై దాడి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు ఆదివారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఈ నెల 26న మహబూబాద్ జిల్లా వీఎస్ లక్ష్మాపురం గ్రామానికి చెందిన ధర్మారం శ్రీశైలం కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ లింగా కారును ఆపారు. కారుపై ఉన్న చలానా కట్టాలని శ్రీశైలంపై ఒత్తిడి చేశారు. తాను తర్వాత కట్టుకుంటానని శ్రీశైలం చెప్పడంతో అతడిపై దాడి చేసి గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ లింగాను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు సీఐ హనుమంతు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఒగ్గు కళాకారుడు మృతి
అర్వపల్లి : ఒగ్గు కథ చెప్పడానికి బైక్‌పై వెళ్తు న్న ఒగ్గు కళాకారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాలు.. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన ఒగ్గు కళా కారుడు కొల్లు యాదయ్య(53) ఆదివారం ఒగ్గు కథ చెప్పడానికి జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం వెళ్తున్నాడు. మార్గమధ్యలో నాగారం మండలం ప్రగతినగర్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న వరికోత మిషన్‌ను పక్క నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాదయ్యను స్థానికులు సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.
కృష్ణానదిలో మునిగి బాలుడు మృతి
మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరు వద్ద ఆదివారం కృష్ణానదిలో మునిగి బాలుడు మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన కాసాని గోపయ్య తన ఇద్దరు కుమారులను తీసుకొని పాత వెల్ల టూరు గ్రామంలోని తన అత్తగారింటికి వెళ్లాడు. గోపయ్య చిన్న కుమారుడు వరుణ్(7) తన అమ్మమ్మ ఇంటి సమీపంలో కృష్ణానది వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. పెద్ద కుమారుడు వచ్చి తమ్ముడు నదిలో పడిపోయాడని గోపయ్యకు చెప్పడంతో వారు వెళ్లి గంట సేపు వెతికిన తర్వాత కృష్ణానదిలో వరుణ్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు
నార్కట్‌పల్లి : ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై నార్కట్‌పల్లి పోలీసులు ఆది వారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండల పరిధిలోని తొండల్‌వాయి గ్రామానికి చెందిన బింగి సాయిబాబా ఆరేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు మరో బాలికతో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో సదరు యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సాయిబాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు.


