అంగరంగ వైభవంగా కల్యాణ వేడుక
బ్రహ్మోత్సవాల్లో నేడు..
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. రాత్రి 9గంటలకు అర్చకులు, ఆలయ అధికారులు గజవాహనంపై లక్ష్మీనరసింహస్వామిని, ప్రత్యేక పల్లకీలో లక్ష్మీదేవిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ ఉత్తర మాడ వీధిలోని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆలయాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టువస్త్రాలతో గజవాహన సేవ ముందు నడిచారు. అనంతరం 9.45 గంటలకు కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్లను అధిష్ఠించి తిరుకల్యాణ వేడుకకు శ్రీకారం చుట్టారు. కల్యాణ వేదికపై ఆసీనులైన స్వామి, అమ్మవార్లకు అర్చకులు విష్వక్సేనారాధాన నిర్వహించారు. మంత్రపుష్పం, సంప్రోక్షణ జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రాచార్యులు కంకణధారణ చేసి 11.21 గంటలకు జంజరాధారణ (యజ్ఞోపవీతం) గావించారు. అనంతరం జీలకర్ర బెల్లం తంతు, సింహ లగ్నం ముహూర్తంలో మాంగల్యధారణ గావించారు. ముత్యాల తలంబ్రాల వేడుక నిర్వహించారు.
ఉదయం రామావతారంలో..
ఉదయం ఆలయంలో అర్చకులు నిత్యారాధనలు, ప్రభాత భేరీ, విష్ణు సహస్రనామ పారాయణం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని శ్రీరాముడిగా అలంకరించి హనుమంత వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.
భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు..
కల్యాణోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అక్షాంశ్‌యాదవ్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు పర్యవేక్షణలో ఒక డీఎస్పీ, 8మంది సీఐలు, 18మంది ఎస్సైలు, 150 మంది పోలీస్ సిబ్బందితో రింగ్‌రోడ్డు, ఘాట్‌రోడ్డు, ఆలయ పరిసరాలు, కల్యాణ వేదిక వద్ద బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం 5గంటల నుంచే కొండపైకి వాహనాలను కట్టడి చేశారు.
పెళ్లి కూతురుగా ముస్తాబైన లక్ష్మీదేవి
గజవాహనంపై లక్ష్మీనరసింహస్వామి
గురువారం ఉదయం స్వామివారు మహావిష్ణు అలంకారంలో గరుడ వాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు.
ఫ గజవాహనంపై ఊరేగిన స్వామివారు
ఫ ఉదయం రామావతారంలో
హనుమంత సేవ
అంగరంగ వైభవంగా కల్యాణ వేడుక


