కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు
మునగాల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం మండలంలోని నారాయణగూడెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణగూడెంలో అగ్ర వర్ణాలకు చెందిన వారు మాలలపై విపరీతంగా దాడి చేశారన్నారు. తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా శాయంపేటలో మాలబిడ్డపై దాడి జరిగితే దానిని తీవ్రంగా ఖండించి ఆ బిడ్డకు న్యాయం చేకూర్చినట్లు తెలిపారు. కారంచెడు, చుండూరు, ఈ మధ్య మరియమ్మపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించి వారికి న్యాయం చేసేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాడిందన్నారు. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసలతో మృతిచెందితే దానిని తీవ్రంగా ఖండించడంతో పాటు దోషులను శిక్షించాలని నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు.


