పాలిటెక్నిక్ కళాశాలలో నూతన కోర్సులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా రెండు కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులను కొత్తగా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కోర్సులు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పిస్తాయని వెల్లడించారు. పాలిసెట్ 2026లో ఎక్కుల సంఖ్యలో విద్యార్థులు నమోదు కావాలని ఆకాంక్షించారు.
కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి కార్మికుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులుగా పనిచేస్తున్న వారు నేటికీ శ్రమదోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీల విధానం రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా కార్మికులకు జీతభత్యాల అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 28న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వరంగల్‌లో జరగనున్న సభకు కార్మికులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వనాథులు లెనిన్, యాదగిరి, ిసీహెచ్.నిర్మల, పి.ఎల్లమ్మ, పద్మ, రామేశ్వరమ్మ, అన్నపు లింగస్వామి, సందీప్, మధు, సబిత, నిర్మల, ఉషమ్మ, యాదమ్మ పాల్గొన్నారు.
ఖోఖో సంబురం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ ఔట్‌డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి బాలబాలికల ఖోఖో పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం పోటీలను జిల్లా యువజన, క్రీడల అధికారి అక్బర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో సత్తాచాటి తెలంగాణకు మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల జట్లు నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికాారి అక్బర్ అలీ, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


