మున్సిపల్‌ బడ్జెట్‌పై కసరత్తు! | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ బడ్జెట్‌పై కసరత్తు!

Feb 23 2026 8:55 AM | Updated on Feb 23 2026 8:55 AM

మున్సిపల్‌ బడ్జెట్‌పై కసరత్తు!

మున్సిపల్‌ బడ్జెట్‌పై కసరత్తు!

భువనగిరిటౌన్‌ : మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాల కొలువుదీరాయి. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చిలో బడ్జెట్‌ రూపొందిస్తారు. ఇందులో భాగంగా వార్షిక బడ్జెట్‌ రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చైర్మన్లతో చర్చించి ప్రతిపాదనలు తయారు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రతిపాదనలు అనంతరం బడ్జెట్‌ ఆమోదించేందుకు ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

బడ్జెట్‌ రూపకల్పన ఇలా..

జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, పోచంపల్లి, మోత్కూర్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీకి సంబంధించి ఆదాయం, ఖర్చులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు, రోడ్ల నిర్మాణం, నిర్వహణ, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, వంటి పనుల ఆధారంగా బడ్జెట్‌ రూపొందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్‌, నీటి చార్జీలు, ట్రేడ్‌ లైసెన్స్‌, టెండర్లకు సంబంధించిన ఈఎండీ (డిపాజిట్లు)ల ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తారు. తర్వాత మున్సిపాలిటీల పరిధిలో రోడ్ల నిర్వహణ, డ్రెయినేజీ, శానిటేషన్‌ వంటి పనులకు ఖర్చులను లెక్కించనున్నారు. వీటితోపాటు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు, ఆర్థిక సంఘం నిధులు ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకుని 10–20శాతం పెంచి బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ఈ బడ్జెట్లో 10శాతం తప్పనిసరిగా గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించాల్సి ఉంటుంది.

కలెక్టర్‌ పరిశీలన.. కౌన్సిల్‌ ఆమోదం

మున్సిపల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో అధికారులు రూపొందించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను కలెక్టర్‌ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది. కలెక్టర్‌ పరిశీలించడంతో పాటు ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేస్తారు. అనంతరం వార్షిక బడ్జెట్‌ ఆమోదం కోసం స్పెషల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ నిర్వహిస్తారు. చైర్మన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కౌన్సిలర్లు చర్చించి, ఆమోదించిన తర్వాత కలెక్టర్‌కు పంపిస్తారు. తిరిగి కలెక్టర్‌ నుంచి మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపించనున్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి మార్చిలో

బడ్జెట్‌ రూపకల్పన

చైర్మన్లతో చర్చించి ప్రతిపాదనలు

తయారు చేసేందుకు సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement