ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు
ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థులకు వార్డుల్లో పలు సమస్యలు స్వాగతం పలికాయి. సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థుల దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు రూ.కోట్లలో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో నిధులు ఉండడం వీరికి కలిసొచ్చే అంశం. ఆ పనులకు త్వరలో శంకుస్థాపనలు చేయనున్నారు.
సాక్షి, యాదాద్రి : పట్టణాల అభివృద్ధి.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ పాలకవర్గాలపై ఉంది. మున్సిపాలిటీల్లో సరిపడా నిధులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇటీవల ప్రభుత్వం పట్టణాలకు నిధులు సమృద్ధిగా కేటాయిస్తుండడంతో పట్టణాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే అభివృద్ధి పనులు చేసేందుకు మున్సిపాలిటీల్లో నిధులు ఉండడం ఇటీవల కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఊరట కలిగిస్తున్నాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు తెలంగాణ రైజింగ్ విజన్–2027 పథకంలో భాగంగా రూ.90 కోట్ల నిధులు వచ్చాయి. ఆ నిధులతో 2026 మార్చి నాటికి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన..
జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీలకు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి పథకం యూఐడీఎస్ ద్వారా రూ.90 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులు వచ్చాయి. ఈ నిధులు ఖర్చు చేసేందుకు మున్సిపాలిటీల్లో చేపట్టే పనుల డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడం దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రత్యేకాధికారుల పాలనలో నిధుల ఖర్చులో జాప్యం జరిగింది. నూతన పాలకవర్గాలకు ఈ నిధులు వరంగా మారాయి.
అనుమతి కోసం ఈఎన్‌సీకి..
అధికారులు కొన్ని డీపీఆర్‌లను పూర్తిచేసి సాంకేతిక అనుమతి కోసం ఈఎన్‌సీకి పంపించారు. అక్కడినుంచి అనుమతి రాగానే మున్సిపాలిటీల వారీగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం శంకుస్థాపనలు చేస్తారు. మురుగు నీటి డ్రెయిన్లు, అంతర్గత రోడ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రాంతాల్లో మౌలిక వసతులు, పార్కులు, ఓపెన్ జిమ్‌ల అభివృద్ధి, మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేస్తారు.
అభివృద్ధి పనులు ఇలా..
● భువనగిరి మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణానికి రూ. 59.6 లక్షలు కేటాయించారు. సీసీ డ్రెయినేజీల నిర్మాణానికి రూ.46.4 లక్షలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణానికి రూ.45 లక్షలు, పార్కు అభివృద్ధికి రూ.4 లక్షలు, ప్రధాన రహదారులపై బాక్స్ కల్వర్టుల నిర్మాణానికి రూ.కోటి, మున్సిపాలిటీలో రహదారులు, జంక్షన్ల అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయించారు.
● ఆలేరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులతో హైస్కూల్ ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నారు. వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, స్ట్రాం వాటర్ డ్రెయిన్‌లు, ఒక పార్కు, విలీన గ్రామమైన బహుద్దూర్‌పేటలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
● భూదాన్ పోచంపల్లిలో రూ.15 కోట్ల నిధుల్లో.. రూ.5 కోట్లతో సీసీ రోడ్లు, రూ.5 కోట్లతో డ్రెయినేజీలు, పార్కు నిర్మించనున్నారు. నారాయణగిరి వద్ద కల్వర్టు నిర్మాణం, విలీన గ్రామాలైన ముక్తాపూర్, రేవనవల్లిలో శ్మశానవాటికల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
● మోత్కూర్ మున్సిపాలిటీ రూ.15 కోట్లతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నారు. విలీన గ్రామాలైన కొండగడప, బుజ్జిలాపురంలో అభివృద్ధి పనులు చేయనున్నారు.
● చౌటుప్పల్ మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేస్తారు.
● యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేయడానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ పనులకు త్వరలో శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రత్యేక అధికారుల పాలనలోనే మంజూరైన నిధులు
ఫ ఎన్నికల కారణంగా డీపీఆర్ తయారీలో ఆలస్యం
ఫ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
ఫ శివారు కాలనీల్లో అభివృద్ధి పనులు


