కల్యాణ వేదిక ఏర్పాట్ల పరిశీలన
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 25వ తేదీ బుధవారం రాత్రి ఉత్తర మాడ వీధిలో జరిగే శ్రీస్వామి అమ్మవార్ల తిరు కల్యాణ మహోత్సవ వేదికను ఈఓ భవానిశంకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వీవీఐపీలు, దాతలు, కల్యాణ టిక్కెట్లు కొనుగోలు చేసే భక్తులు, మీడియాతోపాటు భక్తులకు వేర్వేరుగా విశాలమైన గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కల్యాణ వేదిక సైతం విశాలంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుమారు 10వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సైతం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసి భక్తులు కల్యాణం తిలకించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఆలయ అధికారులు దయాకర్‌రెడ్డి, రాజన్‌బాబు తదితరులు ఉన్నారు.
పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన
భువనగిరి : భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన సేవ, సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
యూరియా యాప్‌పై రైతుల నిరసన
సంస్థాన్ నారాయణపురం : సెల్‌ఫోన్‌లో యూరియా బుక్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నామని సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో శుక్రవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. నాగలి పట్టే రైతు దగ్గర స్మార్ట్‌ఫోన్ ఎక్కడుంటుంది.. అక్షరాలు రాని రైతులు యాప్‌లో యూరియా ఎలా బుకింగ్ చేస్తారని రైతులు ప్రశ్నించారు. యూరియా కోసం ఎన్ని రోజులు తిరగాలి, ఎవరి దగ్గర బుకింగ్ చేసుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా వస్తే నిమిషాల్లో బుకింగ్ అయిపోయిందంటున్నారు..అంటూ దామోదర్‌రెడ్డి అనే రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.
కల్యాణ వేదిక ఏర్పాట్ల పరిశీలన
కల్యాణ వేదిక ఏర్పాట్ల పరిశీలన


