అన్ని స్థానాలను కై వసం చేసుకుంటాం
యాదగిరిగుట్ట: ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం సీపీఐ రాష్ట్ర నాయకులు గోద శ్రీరాములుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఐ, సీపీఎంతో కాంగ్రెస్ పార్టీ ఆయా మున్సిపాలిటీల్లో పొత్తులు పెట్టుకొని ముందుకు వెళ్తుందన్నారు. ఆరు మున్సిపాలిటీలో మిత్రపక్షమైన సీపీఐ, సీపీఎం సహకారంతో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. గత ఎన్నికల్లో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికంగా సీట్లు గెలిస్తే, బీఆర్‌ఎస్ మాత్రం ఎక్స్ అఫీషియో సభ్యులను వినియోగించుకొని చైర్మన్ సీటు తీసుకుందని, కానీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అధికంగా సీట్లు సాధించి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంతో బహిరంగంగా పొత్తులు పెట్టుకుంటే.. బీఆర్‌ఎస్, బీజేపీలు పైకి కొట్లాడుకొని, లోపల పొత్తులకు సహకరించుకుంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, సీనియర్ నాయకులు ఎరుకల హేమేందర్, ఇరు పార్టీల నాయకులు ముక్కెర్ల మల్లేష్, కాటబత్తిని ఆంజనేయులు, శ్రీరాములు, పేరబోయిన పెంటయ్య, బబ్బూరి శ్రీధర్ పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


