మరో మూడు గ్రామాల్లో పులి సంచారం
ఫ తిరుమలపురం, శ్రీనివాసపురం, కొండాపూర్‌లో పులి అడుగుల గుర్తింపు
ఫ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్
తుర్కపల్లి: తుర్కపల్లి మండలంలోని తిరుమలపురం, శ్రీనివాసపురం, కొండాపూర్ గ్రామాల్లోనూ పులి సంచారం కలకలం రేపింది. పులి తిరిగినట్లు దాని అడుగులను గురువారం స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వచ్చి పరిశీలించి అవి పులి అడుగులేనని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ మాట్లాడుతూ పులిని పట్టుకునేందుకు రెండు రోజులుగా టైగర్ మానిటరింగ్ టీంతో కలిసి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. తిరుమలపురం నుంచి కొండపూర్ శివారు వరకు పులి వెళ్లినట్లు సమాచారం రావడంతో అక్కడ పరిశీలన చేపట్టి అడుగులను గుర్తించినట్లు చెప్పారు. పులి తిరిగి దత్తాయపల్లి వైపు వస్తుందా లేక సిద్దిపేట జిల్లా జగదేవపురం మండలం పీర్లపల్లి గ్రామ శివారులోని అతిపెద్ద అటవీ ప్రాంతంల్లోకి వెళ్లిందా అన్నది స్పష్టత రావాల్సి ఉందన్నారు. గతంలో ఆవుల మృతి చెందిన స్థలంలో కళేబరాలు ఉండటంతో పులి మళ్లీ అక్కడికి వచ్చే అవకాశం ఉందని అందుకే అప్రమత్తంగా వేచి చూస్తున్నామని చెప్పారు. తుర్కపల్లి మండలంలోని తిరుమలపురం, కొండాపూర్, వీరారెడ్డిపల్లి, శ్రీనివాసపురం, వాసాలమర్రి గ్రామాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి 7 గంటల తరువాత బయటకు రావద్దని, వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువులు మేకలను ఇంటి వద్దకు తీపుకొచ్చి కట్టేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి వేళ ఒంటరిగా అడవిలోకి లేదా గ్రామం బయటకు వెళ్లవద్దన్నారు. అవసరమైతే గుంపులుగా వెళ్లాలని సూచించారు. టైగర్ మానిటరింగ్ టీం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని కోరారు. ఆయన వెంట సెక్షన్ ఆఫీసర శాలిని, బీట్ ఆఫీసర్లు మల్లేశం, శ్రీనివాస్, టైగర్ మానిటరింగ్ టీం సభ్యులు ఉన్నారు.


