కమిటీ వేసి పూర్తిస్థాయి విచారణ చేస్తాం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరిగిన బంగారు, వెండి డాలర్ల దొంగతనంపై పూర్తి స్థాయిలో కమిటీ వేసి విచారణ చేస్తామని ఆలయ ఈఓ భవానీ శంకర్ వెల్లడించారు. యాదగిరి కొండపైన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ఎలాంటి తప్పులు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశాలను పరిశీలిస్తామన్నారు. కమిటీ వేసి, జరిగిన తప్పుపై రిపోర్టు త్వరలోనే సమర్పించాలని ఆదేశిస్తానన్నారు. ఎవరి వద్ద, ఎలాంటి తప్పు జరిగిందనే వివరాలే కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ విధంగా ఉండాలనేది కమిటీ నిర్ణయించాలని ఆదేశించనున్నట్లు తెలిపారు. కమిటీ పూర్తి రిపోర్టు ఇచ్చిన తరువాత సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
భువనగిరి: మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్ సూచించారు. గురువారం రాత్రి భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక హన్మాన్‌వాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల వంటగది, తరగతి గదులను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
నేడు మందనపల్లికి మీనాక్షినటరాజన్
ఆలేరురూరల్: ఆలేరు మండలం మందనపల్లి గ్రామానికి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ రానున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ తెలిపారు. గురువారం మందనపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ చట్టంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మందనపల్లిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వారు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పనులపై మహిళలతో మాట్లాడుతారని చెప్పారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా రానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీపాల్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ లావణ్యవెంకటేష్, దశరథ, శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు భేష్
యాదగిరిగుట్ట రూరల్: వంగపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు బాగున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్, పంచాయతీ రాజ్ విభాగం కర్ణాటక, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధికారుల బృందం ప్రశంసించింది. ఉపాధి శిక్షణలో భాగంగా 30 మంది అధికారుల బృందం గురువారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పర్యటించింది. పల్లె పకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, క్యాటిల్ షెడ్, రైతు వేదిక, అంగన్‌వాడీ భవనం, ఇందిరమ్మ ఇల్లు తదితర అభివృద్ధి పనులను పరిశీలించింది. పనులు ఎలా చేశారో విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఏపీడీ కాసం నవీన్ కుమార్, ఈసీ రాజ శేఖర్, ఏపీఓ లింగంపల్లి నర్సయ్య, ఏపీఎం వెంకటేష్, టీఏ వెంకట నారాయణ, పంచాయతీ కార్యదర్శులు లావణ్య, సర్పంచ్ ఒగ్గు రవళి, ఉప సర్పంచ్ చిన్న మల్లయ్య, కానుగు రాజీవ్, మల్లేష్ పాల్గొన్నారు.
కమిటీ వేసి పూర్తిస్థాయి విచారణ చేస్తాం
కమిటీ వేసి పూర్తిస్థాయి విచారణ చేస్తాం


