సాక్షి, భీమవరం: జిల్లాలోని 393 పంచాయతీలు, 4,206 వార్డుల్లో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఈనెల 15నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. తొలి దశలో తాడేపల్లిగూడెం డివిజన్, తర్వాత నరసాపురం, చివరిగా భీమవరం డివిజన్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.
192 మహిళలకు.. 201 పురుషులకు..
జిల్లాలో 409 పంచాయతీలకు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాల్టీల్లో విలీనానికి వ్యతిరేకంగా 16 పంచాయతీలు దాఖలు చేసిన కేసులను ఇటీవల హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. మిగిలిన వాటిలో 192 పంచాయతీలను మహిళలకు, 201 పంచాయతీలను పురుషులకు రిజర్వు చేశారు. ఎస్సీలకు 71 (మహిళలకు 31, జనరల్‌కు 40), బీసీలకు 120 (మహిళలకు 57, జనరల్‌కు 63), జనరల్ కేటగిరీకి 201 (మహిళలకు 104, జనరల్‌కు 98) పంచాయతీలు రిజర్వు చేశారు. వార్డులను 50 శాతం మహిళలకు, 50 శాతం పురుషులకు కేటాయించారు.
మూడు దశల్లో..
మొదటి విడతకు ఈనెల 13న, రెండో విడతకు 16న, మూడో విడతకు 19న నోటిఫికేషన్ విడుదల కానుంది. 26న తొలి విడత, 29న రెండో, డిసెంబరు 2న మూడో విడత పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, అనంతరం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. మొత్తంగా 10,42,937 మంది ఓటర్లుకు 4,382 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
సమన్వయంతో పనిచేయాలి : జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొదటి విడతలో 1,548, రెండో విడతలో 1,568, మూడో విడతలో 1,266 కలిపి మొత్తం 4,382 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మొదటి విడత ఎన్నికలకు సుమారు 5,038 మంది, రెండో విడతకు సుమారు 5,056, మూడో విడతకు సుమారు 4,036 మంది కలిపి దాదాప 14,130 మంది సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ కేఆర్ కల్పశ్రీ, డీఆర్వో పి.గ్లోరీ, ఆర్డీఓలు కేఆర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దాసిరాజు, ఎం.సూర్యారావు, డీపీఓ పి.విజయ భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 393 పంచాయతీలు, 4,206 వార్డులకు ఎన్నికలు
4,382 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఈనెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు ఎన్నికలు
మూడు దశల్లో నిర్వహణ


