ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్, మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు ఆరోపించారు. సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అధికారుల వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో జరిగిన పరిణామాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, కూ టమి నాయకులు కుమ్మకై ్క కౌంటింగ్ సమయంలో ఓట్ల కట్టలను మార్చారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసేందుకు రీకౌంటింగ్ నిర్వహించాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రతి ఓటుకు విలువ ఉండాలని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కౌంటింగ్‌లో అవకతవకలపై న్యాయపోరాటానికి దిగామని, ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని, తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. అలాగే 52వ డివిజన్‌కు సంబంధించి కుంచుమర్తి అనురాధను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమె భర్త మున్సిపల్ ఉద్యోగి అనే కారణంతో అనర్హురాలిగా ప్రకటించడం అన్యాయమని అన్నా రు. ఈ వ్యవహారంపై కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, త్వరలోనే తమకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని, న్యాయపరంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, జక్కుల బెనర్జీ, మున్నుల జాన్ గురునాథ్, నెరుసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు, జుజ్జువరపు విజయనిర్మల, కిలాడి దుర్గారావు, ఇనపనూరి జగదీష్, దాసరి రమేష్, స్టాలిన్, జేవియర్, పత్తిపాటి తంబి, వేగి ప్రసాద్, బుద్దాల రాము, తుమరాడ స్రవంతి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కన్వీనర్ జయప్రకాష్


