వైఎస్సార్సీపీ కన్వీనర్ యోగీంద్రకుమార్ ధ్వజం
ఉండి: పూర్తిస్థాయిలో ముంపునకు గురైన యండగండి గ్రామంలో పునరావాసం ఎందుకు కల్పించడం లేదంటూ వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ మంతెన యోగీంద్రకుమార్ (బాబు) మండిపడ్డారు. సోమవారం గ్రామంలో ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల నుంచి గ్రామం ముంపులోనే ఉన్నా ప్రభు త్వం బాధితులకు ఎందుకు పునరావాసరం కల్పించలేదన్నారు. ప్రజా సంక్షేమం కంటే కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు, ఎన్నికలే ముఖ్యమని విమర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు వెంటనే పునరావాసం కల్పించాలని, పూర్తిస్థాయిలో ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. రోజుకు ఒక ట్యాంకర్ మాత్రమే తాగునీరు అందిస్తుండటంతో వందలాది మంది తాగునీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కూడా యండగండి గ్రామం ఇలానే ముంపునకు గురైందని, ప్రభుత్వం ముంపు నివారణ చర్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. వేసవిలో సరైన చర్యలు చేపట్టి ఉండి కాలువ, యనమదుర్రు గట్లు బలోపేతం చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. గట్లను వెంటనే బలోపేతం చేయాలని లేకుంటే వచ్చే వేసవిలో తామే గట్లు బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపడతామని యోగీంద్రబాబు అన్నారు. గ్రామ పెద్దలు ఏనుగుపల్లి సుబ్బరాజు, జోదుల రాజీవ్, గ్రామస్తులు దిడ్ల ప్రేమ్‌కుమార్, ఎలకపాటి కృష్ణసింగ్, వర్ధనపు చిన్న తదితరులు ఉన్నారు.


