తాడేపల్లిగూడెం: కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అంతర్గత విభేదాలతో తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఎంపీటీసీ ఫలితం బొప్పి కట్టడంతో తమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం జరిగిన నియోజకవర్గ టీడీపీ సమావేశంలో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన పరిమి రవికుమార్ కన్నీళ్లు పర్యంతరం కాగా.. ఇద్దరు కార్యకర్తలు శరీరంపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశా రు. రెవెన్యూ, పోలీసు అధికారులపై ఆరోపణలు చేయడంతో పాటు కూటమికి వెన్నుపోటు పొడిచే వారిని ఎమ్మెల్యే పెంచి పోషిస్తున్నారని జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని కడియద్ద ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ గెలిచినా.. జనసేనకు ఎలా ప్రకటించారో, అలాగే వెంకట్రామన్నగూడెం ఫలితాన్ని టీడీపీకి ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. బాపిరాజు మాట్లాడుతూ కడియద్దలో జనసేన ఒక ఓటుతో ఓడిపోయింది.. వెంకట్రామన్నగూడెంలో టీడీపీ ఏడు ఓట్లతో గెలిచిందని, కడియద్దలో రీ కౌంటింగ్ పెట్టించనని, పెట్టిస్తే వెంకట్రామన్నగూడెం కూడా రీ కౌంటింగ్ అడుగుతారని ఎమ్మెల్యే బొలిశెట్టి తనతో అన్నారన్నారన్నారు. అయితే కడియద్దలో రీకౌంటింగ్ పెట్టించి ఒక ఓటుతో జనసేన అభ్యర్థిని గెలిపించారని విమర్శించారు. ఎమ్మెల్యేకు అనుంగ శిష్యులుగా ఉన్న ఇద్దరు చోటా నేతలు వెంకట్రామన్నగూడెంలో ఇండిపెండెంటుగా నామినేషన్ వేస్తే ఎమెల్యే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా అని బాపిరాజు ప్రశ్నించారు. బాధ్యత తీసుకోకపోతే ఇది మీరే చేశారనుకుంటారు కదా అని తాను అడిగానన్నారు. అలాగే టీడీపీ నాయకుడు గంధం సతీష్ బంధువు కౌంటింగ్ హాలులో ఉన్న అధికారికి ఫోన్ చేసి తేడా వస్తే పీకలు కోసేస్తాం అని బెదిరించారని, డైరెక్ట్‌గా రొమ్ము విరిచి ఓడించే దమ్ము లేక, దొంగల మాదిరిగా చేతకాని దద్దమ్మలు కాబట్టి ఇలా చేస్తున్నారని బాపిరాజు మండిపడ్డారు. శనివారం అర్ధరాత్రి తాడేపల్లిగూడెం నన్నయ వర్సిటీలోని కౌంటింగ్ హాలు వద్ద వెంకట్రామన్నగూడెం ఫలితం ప్రకటించిన తర్వాత టీడీపీ శ్రే ణులు ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చే శారు. దీంతో కూటమిలో చిచ్చు మరింత ఎలా రాజుకుందో సోమవారం సమావేశంతో పూర్తిగా బహిర్గతమైంది.
శరీరంపై డీజిల్ పోసుకొని ఆత్మాహత్యాయత్నం చేస్తున్న కార్యకర్తలు
సొంత పార్టీ వారే వెన్నుపోటు పొడిచారని అభ్యర్థి ఆవేదన
ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
ఎమ్మెల్యే బొలిశెట్టిపై పరోక్ష ఆరోపణలు


