గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అండగా..
123 మి.మీ. సగటు వర్షపాతం
ముంచేసిన మురసు
● భారీ వర్షాలతో దిక్కుతోచని రైతులు
● ఇప్పటికే అర్నబ్‌తో 71,333 హెక్టార్లలో నేలకొరిగిన పంట
● పొలాల్లోని ముంపునీరు లాగకుండానే మురసు తుపాను దాడి
● పొట్ట, పాలుపోసుకునే దశల్లో కుళ్లిపోతున్న వరి
● పెట్టుబడులు కూడా రావని వాపోతున్న రైతులు
సాక్షి, భీమవరం: అర్నబ్ తుపాను దెబ్బ నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు.. పొలాల్లో ముంపు నీరు లాగలేదు.. క్షేత్రస్థాయిలో పంట నష్టం సర్వే మొదలుకాలేదు.. పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు.. అంతలోనే మురసు తుపాను చివరి ఆశలపై నీళ్లు కుమ్మరిస్తోంది. ఎడతెరపి లేని వర్షాలతో కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. పొట్ట, పాలుపోసుకునే దశలో వరి పైరు కుళ్లిపోతుండటం కలవరపరుస్తోంది.
ఎడతెరపి లేని వాన : మురసు తుపాను ప్రభావంతో జిల్లా అంతటా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయానికి జిల్లాలో 151 సెం.మీ, ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయానికి 84 సెం.మీ వర్షం కురిసింది. అత్యధికంగా భీమవరం, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు, పాలకోడేరు, పెనుగొండ తదితర చోట్ల 14 సెం.మీ పైబడి వర్షపాతం నమోదైంది. ఎడతెరపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
భీమవరంలో భారీ వర్షం
జిల్లా కేంద్రం భీమవరంలో భారీ వర్షంతో కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, చినరంగనిపాలెం, ఇండస్ట్రీయల్ ఏరియా తదితర చోట్ల మోకాలులోతు నీటితో రాకపోకలకు ప్రజలు తీవ్ర అగచాట్లు పడాల్సి వచ్చింది. భారీ వర్షాల నేపఽథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు కలెక్టర్ సీహెచ్ నాగరాణి సెలవు ప్రకటించారు.
చివరి ఆశలపై నీళ్లు
జిల్లాలోని 87 వేల హెక్టార్లలో రైతులు ఖరీఫ్ సాగు చేశారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో వరి కోతలు మొదలయ్యాయి. అధిక శాతం విస్తీర్ణంలో పాలుపోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉంది. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. మరో పది రోజుల్లో జిల్లా అంతటా వరికోతలు మొదలుకానున్నాయి. ఈ తరుణంలో గత నెల 27న రాత్రి నరసాపురం వద్ద తీరాన్ని తాకిన అర్నబ్ తుపాను వరి పంటకు అపార నష్టం కలుగజేసింది. ఈదురుగాలులు, భారీ వర్షాలు జిల్లాలోని 303 గ్రామాల పరిధిలో 1,02,939 మంది రైతులకు చెందిన 71,333 హెక్టార్లలో వరి పంట నేలకొరిగినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పొలాల్లో ముంపు నీరు లాగక పూర్తిస్థాయిలో పంట నష్టం సర్వే చేపడతామన్నారు. కొంచెం తెరిపివ్వడంతో పొలాల్లో పంటను కాపాడుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ముంపు నీటిని బయటకు పంపేందుకు బాటలు చేసుకోవడం, నేలనంటిని చేల ను పైకి నిలబెట్టి కట్టలుగా కట్టుకోవడం చేశారు. ఇంతలోనే మురసు రూపంలో వచ్చిన మరో తుపాను మిగిలిన ఆశలను మొత్తం తుడిచిపెట్టేస్తోంది. భారీ వర్షాలతో వరి గింజల్లో తాలు శాతం పెరిగి దిగుబడులు తగ్గిపోతాయని రైతులు వాపోతున్నారు. పైరు నేలనంటడంతో వరికోత యంత్రాల ద్వారా కోయడం సాధ్యం కాదని, కూలీలతో ద్వారా కోయిస్తే చాలా ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని, తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
సగం ఆయకట్టుకు బీమా సాయం లేనట్టే :
పంటల బీమా చెల్లించిన వారికే బీమా పరిహారం అందుతుందని ఇటీవల నరసాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ పంటకు సంబంధించి జిల్లాలో 34,143 హెక్టార్లకు మాత్రమే 64,109 మంది రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. మిగిలిన ఆయకట్టుకు బీమా లేదు. ఈ ఆయకట్టులోని రైతులకు నష్టపరిహారం అందక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
పాలకొల్లు బస్టాండ్‌లో వర్షం నీరు
భీమవరంలో వర్షం నీటిలోనే రాకపోకలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అందజేసి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను ప్రభుత్వమే చెల్లించేది. విపత్తుల సమయంలో ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ అందించి అండగా నిలిచేది. గత ప్రభుత్వంలో 1,09,556 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.103.44 కోట్లు, బీమా పరిహారంగా 1,14,011 మంది రైతులకు రూ.217.64 కోట్లు అందించి ఆదుకున్నారు. కాగా చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను రద్దు చేసింది. గత ఖరీఫ్‌లో మోంథా తుపానుతో జిల్లాలోని 9,201 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా రూ.23 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని ఇప్పటికీ అందించకపోవడం గమనార్హం.
భీమవరం: జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు సగటున 123 మి.మీ. వర్షం కురిసినట్టు సమాచారశాఖ ప్రకనటలో తెలిపింది. అత్యధికంగా నరసాపురంలో 263.6 మి.మీ. నమోదు కాగా.. మండలాల వారీగా తాడేపల్లిగూడెంలో 107.2, పెంటపాడులో 112.6, తణుకులో 68.6, అత్తిలిలో 132.6, గణపవరంలో 112, ఆకివీడులో 103.2, ఉండిలో 153.4, పాలకోడేరులో 183.2, పెనుమంట్రలో 94.6, ఇరగవరంలో 95, పెనుగొండలో 82.4, ఆచంటలో 94.6, పోడూరులో 98.4, వీరవాసరంలో 185.2, కాళ్లలో 101.2, మొగల్తూరులో 149.2, భీమవరంలో 172.4, పాలకొల్లులో 228.1, యలమంచిలిలో 114.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.


