సాక్షి, భీమవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కుట్ర రాజకీయాలకు తెరలేపిన కూటమి పక్షాలు ఊహించనట్టే పుర పోరులో విజయం సాధించాయి. నరసాపురం మున్సిపాల్టీ, ఆకివీడు నగర పంచాయతీలను గెలుపొందాయి. రెండు చోట్లా గట్టి పోటీనిచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆకివీడులో ఐదు, నరసాపురంలో నాలుగు వార్డులను కై వసం చేసుకున్నారు. జిల్లాలోని నరసాపురానికి సంబంధించి వైఎన్ కళాశాల, ఆకివీడుకు సంబంధించి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం కౌంటింగ్ నిర్వహించారు. మున్సిపాల్టీలో 33,348 ఓట్లు పోల వ్వగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కావలి రామసీతకు 7,511 ఓట్లు, జనసేన అభ్యర్థి కొత్తపల్లి శైలజకు 24,580 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తణుకొండ సంతోషకుమారికి 262 ఓట్లు వచ్చాయి. నోటాకు 246 ఓట్లు రాగా, చెల్లని ఓట్లు 765 నమోద య్యాయి. చైర్‌పర్సన్‌గా కొత్తపల్లి శైలజ 17,069 ఓట్లతో విజయం సాధించారు. ఆకివీడులో పోలైన 19,689 ఓట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మన్నే లలితాదేవికి 4,720 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి నిలోఫర్ షేక్‌కు 14,477 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 359 నమోదు కాగా నోటాకు 133 ఓట్లు పోలయ్యాయి. చైర్‌పర్సన్‌గా షేక్ నీలోఫర్ 9,757 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు.
తొమ్మిది వార్డుల్లో వైఎస్సార్‌సీపీ
రెండు చోట్ల తొమ్మిది వార్డుల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు పట్టం కట్టారు. ఆకివీడు పరిధిలో 11వ వార్డులో కుంచాడ బాబ్జ్జీ 199 ఓట్లు మెజార్టీతో గెలుపొందగా, 15వ వార్డు నుంచి మహమ్మద్ రియాజుద్దీన్ అలీ అహ్మద్ 158 ఓట్లు, 17వ వార్డు నుంచి మద్దా ఫ్రాన్సినా 64 ఓట్లు, 19వ వార్డు నుంచి మహమ్మద్ పెర్విన్ భాను మూడు ఓట్లు, 21వ వార్డు నుంచి దొడ్డ జగదీష్ 36 ఓట్లు ఆధిక్యతతో విజయం సాధించారు. 19వ వార్డులో స్వల్ప ఆధిక్యతపై కూటమి నేతలు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారులు మళ్లీ కౌంటింగ్ నిర్వహించి మూడు ఓట్లు ఆధిక్యతతో గెలుపొందినట్టు ప్రకటించారు. నరసాపురంలో 6వ వార్డు పతివాడ మార్కండేయులు 222 ఓట్లు, 14వ వార్డులో బూసరపు ప్రియదర్శిని 38 ఓట్లు, 19వ వార్డు నుంచి షేక్ యాకూబ్‌బీబీ 195 ఓట్లు, 32వ వార్డు నుంచి కొండమంచిలి సంతోషరాణి 26 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కౌంటింగ్‌ను పర్యవేక్షించారు.
నరసాపురంలో కౌంటింగ్ తీరును పరిశీలిస్తున్న కలెక్టర్ నాగరాణి
ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది
ఎమ్మెల్యే సర్వశక్తులు ఒడ్డినా పట్టునిలుపుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
నరసాపురం: వైఎస్సార్‌సీపీ కీలక నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ బులిమస్తాన్ ఎన్నికల్లో తడాఖా చూపించారు. తన సతీమణిని మూడోసారి కౌన్సిలర్‌గా గెలపించుకోవడం ద్వారా సత్తాచాటారు. 19వ వార్డులో ఆయన సతీమణి యాకూబీబీ రెండోసారి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌గా నిలబడగా.. ఓడించేందుకు కూటమి నేతలు నామినేషన్ పర్వం నుంచి పలు వ్యూహాలు అమలు చేశారు. పక్క వార్డుకు చెందిన మహిళతో జనసేన తరఫున నామినేషన్ వేయించి హడావుడి చేశారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఈ వార్డుపై ప్రత్యేక దృష్టి సారించి, అనుచరగణంతో విస్తృత ప్రచారం చేయించారు. ప్రలోభాల వల నుంచి బెదిరింపుల పర్వం వరకూ అన్ని ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా ఓడించి తీరుతామని ఎమ్మెల్యే శపధం కూడా చేసినట్టు తెలిసింది. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బులిమస్తాన్ ఎమ్మెల్యే ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టి తన భార్యను గెలిపించుకున్నారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి ఈ వార్డు ఫలితం పట్టణంలో హాట్‌టాఫిక్‌గా మారింది. భారీగా పందాలు కూడా జరిగాయి. చివరకు బులిమస్తాన్ తన హవా మ రోసారి నిలుపుకున్నారు. తొలి నుంచి కాంగ్రెస్ పా ర్టీలో ఉన్న బులిమస్తాన్ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 1995, 2004లో బులిమస్తాన్ కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొంది వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2009, 2014లో ఆయన భార్య వైఎస్సార్‌సీపీ నుంచి కౌన్సిలర్‌గా పనిచేశారు. గతంలో బులిమస్తాన్ అత్త బాజింబీబీ కాంగ్రెస్ తరఫున ఇదే వార్డు నుంచి ఎన్నికై వీసీగా పనిచేశారు.
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
జిల్లాలో రెండు చోట్ల కూటమి విజయం
ఆకివీడులో ఐదు, నరసాపురంలో నాలుగు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు
గట్టి పోటీనిచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు


