కూటమిలో క్రాస్ గుబులు
ఓటేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
అధికారుల పరిశీలన
పోలింగ్ శాతం
నరసాపురంలోని పొన్నపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు
సాక్షి, భీమవరం: ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రూ.కోట్లు కుమ్మరించిన కూటమి నేతలను షాక్‌కు గురిచేస్తూ పోలింగ్ మందకొడిగా సాగింది. చంద్రబాబు ప్రభుత్వంపై గూడుకట్టుకున్న వ్యతిరేకత పురపోరులో స్పష్టంగా కనిపించింది. ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్ మధ్యాహ్నం సమయానికి కాస్త పుంజుకుంది. మొత్తంగా నరసాపురం మున్సిపాల్టీలో 71.37 శాతం, ఆకివీడులో 74.47 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
ఉదయం మందకొడిగా..
నరసాపురంలో 36 వార్డుల పరిధిలో 71, ఆకివీడులో 19 వార్డుల్లో 32 పోలింగ్ కేంద్రాలను ఏ ర్పాటుచేశారు. ఉదయం ఏడు గంటల నిర్ణీత సమయానికే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఆదివారం సెలవురోజు కావడం, చర్చిల్లో ప్రార్ధన సమయం కావడంతో ఉదయం పోలింగ్ మందకొడిగా మొదలైంది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. 10 గంటల సమయం దాటాక పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్ల రద్దీ మొదలైంది. సాయంత్రం పోలింగ్ ముగిసే సరికి నరసాపురంలో 46,996 మంది ఓట్లకు గాను 33,543 ఓట్లు, ఆకివీడులో 26,435 ఓట్లకు 19,687 ఓట్లు పోలయ్యాయి.
తెగిపడిన నోట్ల కట్టలు
కూటమి నేతలు ఓటమి భయంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఎన్నికల్లో విచ్చలవిడిగా రూ.కోట్లల్లో డబ్బు ఖర్చుచేశారు. మద్యాన్ని ఏరులై పారించారు. ప్రజల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై సానుకూలతకు జడిసి నరసాపురం, ఆకివీడులో కూటమి చైర్మన్, కౌన్సిలర్లు అభ్యర్థులు కలిపి ఓటుకు రూ.1,500 నుంచి రూ.4,000 వరకు నగదుతో పాటు కొందరు చీరలు, మరికొందరు రైస్‌కుక్కర్లు, వెండి భరిణెలు, ఇంటింటికీ బిర్యానీ ప్యాకెట్లు తదితర వాటిని పంపిణీ చేశారు. నరసాపురంలోని ఒక వార్డుల్లో కూటమి అభ్యర్థి, స్వతంత్య్ర అభ్యర్థి కలిపి వస్తు,ధన రూపంలో ఓటుకు రూ.10 వేలకు పైనే ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి మొదలైన పంపకాలు కొన్నిచోట్ల ఆదివారం సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు కొనసాగడం గమనార్హం. ఆకివీడులోని ఒక వార్డులో కూటమి అభ్యర్థి ఓటమి భయంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి కూడా మరోదపా అదనంగా ఓటుకు రూ.1,000 పంపిణీ చేసినట్టు సమాచారం.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, సూపర్‌సిక్స్ వంచనపై ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ప్రజలు క్రాస్ ఓటింగ్ రూపంలో చూపించినట్టు తెలుస్తోంది. చైర్‌పర్సన్ ఎన్నిక ప్రత్యక్ష విధానం కావడంతో చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ కోసం ఓటరుకు రెండు బ్యాలెట్‌లను ఇచ్చారు. చాలాచోట్ల అధికార కూటమి అభ్యర్థితో పాటు వైఎ స్సార్‌సీపీ అభ్యర్థికి చెరొక ఓటుగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రూ. కోట్లు కుమ్మరించినా క్రాస్ ఓటింగ్ తమకు చేటు చేస్తుందన్న ఆందోళన కూటమి అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది.
నరసాపురంలో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కావలి రమాసీత 25వ వార్డులో, ఆకివీడులో చైర్‌పర్సన్ అభ్యర్థి మన్నే లలితాదేవి 16వ వార్డులో ఓటుహక్కును వినియోగించుకున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు కుటుంబ సమేతంగా 6వ వార్డులో ఓటుహక్కును వినియోగించుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ కోఆర్డినేటర్ మంతెన యోగీంద్రకుమార్ (బాబు) ఆకివీడులోని పలు ప్రాంతాల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
నరసాపురంలోని కస్తూరిబా గాంధీ ఉన్నత పాఠశాల, పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాల తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సీహెచ్ నాగరాణి సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నరసాపురం, ఆకివీడులోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షనన్‌ను పకడ్బందీగా అమలు చేస్తూ, 500 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మంగళవారం కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ముందస్తు భద్రతా చర్యలను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు.


