నరసాపురం: నరసాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూకుడు పెంచింది. నామినేషన్ల చివరిరోజు మొత్తం 36 వార్డులకు గాను పెండింగ్లో ఉన్న వార్డుల్లో అభ్యర్థులతో నామినేషన్లు వేయించిన పార్టీ నాయకత్వం అభ్యర్థులకు పార్టీ బీ–ఫామ్లు అందజేసింది. ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు నివాసంలో పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు పతివాడ మార్కండేయులు, మల్లాడి శేషవేణి, ఓలేటి సుశీల, కొడమంలి సంతోష్రాణి, సిర్రా కాంతమ్మ తదితరులకు పార్టీ బీఫామ్లను ప్రసాదరాజు, పార్టీ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు, రాష్ట్ర అధికార ప్రతినిది ముదునూరి మురళీకౄష్ణంరాజు అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు కష్టపడి పనిచేయాలని సూచించారు. వెంటనే ప్రచారం ప్రారంభించి ప్రజలను కలవాలన్నారు. కూటమి ప్రభు త్వం సాగిస్తున్న అరాచక పాలనను ప్రజలకు వివరించాలని, పట్టణ అభివృద్ధికి గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పాలనను వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. మున్సిపాలిటీని తప్పకుండా వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంటుందని చెప్పారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడీ రాజు తదితరులు ఉన్నారు.


