ఫీడ్‌ ధరల పెంపుపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

ఫీడ్‌ ధరల పెంపుపై ఆగ్రహం

Oct 18 2026 1:18 AM | Updated on Oct 18 2026 1:18 AM

● మళ్లీ పెరిగిన ఫీడ్‌ ధరలు

● మండిపడుతున్న ఆక్వా రైతులు

● కూటమి ప్రభుత్వ వైఖరిపై ధ్వజం

● ఆక్వా రైతు సంఘంపైనా అనుమానాలు?

భీమవరం: ఆక్వా రైతుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపరీతంగా పెరుగుతున్న రొయ్యల మేతల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. ఇదివరకే ఇబ్బందుల్లో ఉన్న ఆక్వా రంగానికి ఫీడ్‌ కంపెనీల ధరల పెంపు నిర్ణయం శరాఘాతంగా మారింది. వెనామీ రొయ్యల ఫీడ్‌ టన్నుకు ఎమ్మార్పీపై రూ.9,350, టైగర్‌ ఫీడ్‌పై రూ.12,870 మేర పెంచడంతో శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో వెనామీ ఫీడ్‌ టన్ను రూ.1.23 లక్షలకు, టైగర్‌ ఫీడ్‌ రూ.1.39 లక్షలకు చేరుకున్నాయి.

అప్పుల ఊబిలో ఆక్వా రైతులు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. 2024 ఎన్నికల సమయంలో ఆక్వా రంగానికి జోన్స్‌ ప్రమేయం లేకుండా యూనిట్‌ విద్యుత్‌కు రూ.1.50 సబ్సిడీ ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ హామీని పవర్‌ఫ్యాక్టర్‌కు లింకు పెట్టి అమలు చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రొయ్యల ధరలు తగ్గడం, తెగుళ్లు సోకడంతో పాటు వరుసగా ఫీడ్‌ ధరలు పెరుగుతుండటంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

ప్రభుత్వ కనుసన్నల్లోనే

ఆక్వా సంఘాల నాయకత్వం?

ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ నాయకుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు నాయకత్వంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అమలాపురంలో జరిగిన సదస్సులో సెప్టెంబర్‌ 30 లోపు ఫీడ్‌ ధరలు తగ్గించకుంటే కొనుగోలు నిలిపివేస్తామని తీర్మానించినా, ఆచరణలో ధరలు మరింత పెరగడం గమనార్హం. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ అధికార పార్టీల నాయకులే సంఘాల ప్రతినిధులుగా ఉండటంతో.. ఒకవైపు రైతులను రోడ్డెక్కిస్తూనే, మరోవైపు ప్రభుత్వ కనుసన్నల్లో ఉండి రైతులను నట్టేట ముంచుతున్నారనే విమర్శలు జోరందుకున్నాయి.

అప్సడా నిబంధనలకు తూట్లు

ఫీడ్‌ ధరలు పెంచాల్సి వస్తే రైతులు, కంపెనీల యజమానులు, మత్స్యశాఖ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించాలనే ‘అప్సడా’ నిబంధనలను తుంగలో తొక్కి ఏకపక్షంగా ధరలు పెంచుతున్నా సంఘం నాయకులు స్పందించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీడ్‌ ధరలను అదుపు చేయకపోతే ఆక్వా రంగానికి క్రాప్‌ హాలిడే ప్రకటించడంతో పాటు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement