పెనుగొండ: అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆర్యవైశ్య యువతలో ప్రతిభావంతులకు ప్రతిభా సన్మాన్ అవార్డులను ఆదివారం బహుకరించనున్నట్లు ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ఎస్ సతీష్ తెలిపారు. శనివారం పెనుగొండ వాసవీ శాంతిథాంలో జరిగిన విలేకర్లలో సమావేశంలో మాట్లాడుతూ విద్యా రంగం, క్రీడా రంగం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి రెండేళ్లుగా అవార్డులు ఇస్తున్నట్లు వివరించారు. గతఏడాది 300కు పైగా అవార్డులు ఇవ్వడం జరిగందన్నారు. ఈ ఏడాది 850 మంది అవార్డులకు దరఖాస్తు చేసుకొన్నారని వివరించారు. వీరిలో అత్యంత ప్రతిభా వంతులైన 540 మందిని అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆదివారం వాసవీ థాంలో నిర్వహించబోయే శరన్నవరాత్రి వేడుకల్లో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతిభా సన్మాన్ అవార్డు కమిటి చైర్మన్ డీఎన్ అనిల్, ఈసీ సభ్యులు కే నగేష్ బాబు, కేవీ నాగచరణ్ పాల్గొన్నారు.
పోలవరం రూరల్: గత నాలుగు రోజులుగా పోలవరం మండలంలోనే పెద్దపులి బస చేసింది. కుంకాల, ఉడతపల్లి గ్రామాల మధ్య పాపికొండల అభయారణ్య ప్రాంతంలో పెద్దపులి కదలికలను గుర్తించినట్లు అటవీశాఖ రేంజ్ అధికారి ఎస్కే వలీ తెలిపారు. పులి కదలికలపై పూణేలోని వన్యప్రాణి విభాగం నుంచి వచ్చిన నిపుణుల బృందం పరిశీలిస్తోందని, పులికి అమర్చిన రేడియో కాలర్ నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా దాని జాడను కనిపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఆహారం, నీరు సమృద్ధిగా లభిస్తుండటంతోనే పులి అక్కడే మకాం వేసి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే, ఈ పెద్దపులి నాలుగు జిల్లాల్లో తిరిగి మళ్లీ పోలవరం చేరుకుంది. ఇక్కడి నుంచి అది ఎటువైపు కదులుతుందో తెలియని పరిస్థితి ఏర్పడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పులి సంచరించే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాగం హెచ్చరించింది.
పోలవరం రూరల్: పోలవరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న స్థానికులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గం నీటితో నిండిపోయింది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలగడంతో పాటు, ఈ వర్షం పంటలకు మేలు చేస్తుందని భావిస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేశారు.


