పెనుమంట్ర: వరి పంటలో ఎండాకు తెగులు నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి సహసంచాలకులు డాక్టర్ ఎస్. దయాకర్ సూచించారు. శనివారం మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన వ్యవసాయ శిక్షణ సందర్శన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం సార్వా వరి పంట చిరుపొట్ట దశలో ఉందని, గత నెలలో కురిసిన వర్షాల కారణంగా అక్కడక్కడా బాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగుల ఉధృతి కూడా అక్కడక్కడా కనిపిస్తోందని, అయితే దోమ ఉధృతి మాత్రం తక్కువగానే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం పంట చిరుపొట్ట నుంచి పూత దశకు చేరుకుంటోందని, ఈ సమయంలో వర్షాలు కురిస్తే కంకి చిక్కగా, గింజలు దగ్గరగా ఉండే రకాలన్నింటిలోనూ మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉందన్నారు. అటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటే, లీటరు నీటికి 1.0 మి.లీ ప్రొపికోనజోల్ లేదా 0.4 గ్రా. ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ + టెబుకొనజోల్ కలిసిన మందును చిరుపొట్ట దశలో ఒకసారి, 50 శాతం పూత దశలో మరోసారి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలని సూచించారు.
నీటి తామర కలుపు
లోతట్టు ప్రాంతాల్లో సాగుచేసిన వరిలో నీటి తామర కలుపు సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. దీని నివారణకు కలుపు లేతగా ఉన్నప్పుడే పంట విత్తిన 20–25 రోజుల దశలో ఎకరాకు 400 గ్రాముల 2,4–డి సోడియం ఉప్పు లేదా 90 గ్రాముల ట్రయాఫమోన్ + ఎథోక్సిసల్ఫురాన్ మందును పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చన్నారు.
శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు
ప్రధాన శాస్త్రవేత్త (వరి) డా. ఎం.గిరిజా రాణి మాట్లాడుతూ ఈ సార్వా పంట కాలంలో ఎంటీయూ 1443, ఎంటీయూ 1462 వంటి రకాలను చిరుసంచుల పరిశీలనకు ఇచ్చామని తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు ఆయా మండలాల్లో చిరుసంచులు సాగుచేసిన రైతుల వివరాలు అందజేస్తే, శాస్త్రవేత్తల బృందాలు నవంబర్ మొదటి వారం నుంచి పొలాలను సందర్శిస్తాయని పేర్కొన్నారు. నరసాపురం ఏడీఏ పీవీవీఎన్ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 88,871 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను, ప్రస్తుతం 94,360 హెక్టార్లలో వరి సాగు జరిగిందని, సుమారు ఐదు వేల హెక్టార్లలో అధికంగా సాగు విస్తారమైందని వివరించారు.


