యలమంచిలి: మండలంలోని ఏనుగువానిలంక గ్రామానికి చెందిన ఇనుకొండ వెంకట సత్యనారాయణ (55) చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడని ఆయన భార్య మణికుమారి తెలిపారు. మృతునికి వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని యలమంచిలి పోలీసులు తెలిపారు.
తణుకు అర్బన్: తాళం వేసి ఉన్న ఇంట్లోకి దొంగలు చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఖరీదైన కెమెరాను అపహరించిన ఘటన తణుకు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తణుకుకు చెందిన ఫొటోగ్రాఫర్ చోడవరపు బాలు ఈ నెల 13న కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం వెళ్లారు. శనివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్న ఆయనకు, తలుపు తాళాలు పగలగొట్టి ఉండటం కనిపించింది. అనుమానంతో లోపలికి వెళ్లి పరిశీలించగా ఇంట్లో చోరీ జరిగినట్లు గమనించారు. 6 గ్రాముల బంగారం, 12 తులాల వెండితో పాటు సుమారు రూ.2 లక్షల విలువైన కెమెరాను అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకు పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై సీహెచ్వీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించింది.
యలమంచిలి: ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ క్వాలిఫైయింగ్ పోటీల మెయిన్ డ్రాకు మొత్తం 96 మంది క్రీడాకారులు అర్హత సాధించినట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూన్రాజు తెలిపారు. సీహెచ్ బుద్ధావతారంరాజు మెమోరియల్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ క్వాలిఫైయింగ్ పోటీలు శుక్ర, శనివారాల్లో పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఘనంగా జరిగాయి. ఈ టోర్నమెంట్ మెయిన్ మ్యాచ్లు ఈ నెల 18వ తేదీన ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. సింగిల్స్ విభాగంలో 96 మంది, డబుల్స్ విభాగంలో 48 మంది క్రీడాకారులు మెయిన్ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ప్రధాన పోటీలు పాలకొల్లు టౌన్హాల్తో పాటు నరసాపురం ఆఫీసర్స్ క్లబ్ టెన్నిస్ కోర్టులో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో 45, 55, 65, 70, 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజెన్లు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఉత్సాహంగా పోటీ పడతారని బూన్రాజు వివరించారు.


