● ద్విచక్ర వాహనం అదుపు తప్పి భవానీ మాలధారి దుర్మరణం
● మరో ఇద్దరికి గాయాలు
భీమడోలు: ద్వారకాతిరుమల దైవదర్శనానికి వెళ్తుండగా మోటార్ వాహనం అదుపుతప్పిన ఘటనలో ఓ భవానీ మాలధారి దుర్మరణం చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. శనివారం జాతీయ రహదారిపై భీమడోలు అయ్యప్ప స్వామి వారి ఆలయ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీమవరం నుంచి ద్వారకాతిరుమల పుణ్యక్షేత్రానికి దైవదర్శనం కోసం భవానీ మాలధారులైన ఆకుల నాగమణి, ఆమె కుమార్తె భవానీ, మనవరాలు పావని ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో కురెళ్లగూడెం, భీమడోలు అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి రోడ్డు పక్కన కాలినడకన వెళ్తున్న ఇతర భవానీలను తప్పించే ప్రయత్నంలో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బైక్పై వెనుక కూర్చున్న ఆకుల నాగమణి (53) రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే వాహనంపై ఉన్న కుమార్తె, మనవరాలికి స్వల్ప గాయాలు కావడంతో.. భీమడోలు అంబులెన్స్ సిబ్బంది వారిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆకుల నాగమణి మృతితో ఆమె కుటుంబంలో, భీమవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి భర్త వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై ఎస్.కె. మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


