రిజిస్ట్రార్, డైరెక్టర్‌లు ఇన్‌చార్జులే
● ఆర్జీయూకేటీకి రెగ్యులర్ చాన్సలర్ లేని వైనం
● రిజిస్ట్రార్, నూజివీడు, ఒంగోలు డైరెక్టర్లందరూ ఇన్‌చార్జిలే
నూజివీడు: రాష్ట్రంలోని పేదవర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్జీయూకేటీతో పాటు దీని పరిధి లోని ట్రిపుల్‌ఐటీలకు ఇన్‌చార్జిల పాలనే దిక్కుగా మారింది. ఆర్జీయూకేటీ పరిధిలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలు ఉండగా వీటిల్లో 26,400 మంది విద్యార్థులు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. మొత్తం విద్యార్థుల్లో 65 శాతం మంది విద్యార్థులు బాలికలే ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ పరిధిలో కూడా లేరు. రెండేళ్ల పీయూసీతో పాటు నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యతో పాటు ఎంటెక్‌ను సైతం ఇక్కడ బోధిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆర్జీయూకేటీకి ఇంత వరకు రెగ్యులర్ చాన్సలర్ లేకపోవడం గమనార్హం.
ఉన్నత విద్యామండలి చైర్మన్‌కే ఇన్‌చార్జి బాధ్యతలు
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కొత్తా మధుమూర్తికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్జీయూకేటీ చాన్సలర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో మధుమూర్తి ఉన్నత విద్యామండలి చైర్మన్ బాధ్యతలకే పరిమితమవుతూ ట్రిపుల్‌ఐటీలకు అప్పుడప్పుడు కనీసం చుట్టపు చూపుగా కూడా రావడం లేదు. స్నాతకోత్సవం, కాంటమ్ ల్యాబ్ సందర్శించేందుకు ఢిల్లీ బృందం వచ్చినప్పుడు తప్ప నూజివీడు ట్రిపుల్‌ఐటీకి టీడీపీ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఇంత వరకు రాలేదు. తమ సమస్యలను చెప్పుకుందామనుకుంటున్న ఫ్యాకల్టీకి ఇంతవరకు కనీసం చాన్సలర్ ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అధికారులు తెచ్చే ఫైళ్లు చూసి సంతకాలు చేసి పంపడం తప్ప క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఫ్యాకల్టీ ఇబ్బందులు ఏమిటి, విద్యార్థుల సమస్యలు, బోధన వంటి అంశాలను ఏనాడు పర్యవేక్షించలేదు. దీనికంతటికి ఇన్‌ఛార్జి కావడమేనా అనే ప్రశ్నలు సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి.
నూజివీడులోని ట్రిపుల్‌ఐటీ
ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌తో పాటు నూజివీడు, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు డైరెక్టర్లు ఇన్‌చార్జులే కావడం గమనార్హం. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అయిన ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌తో పాటు ఒంగోలు ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆర్జీయూకేటీ వైస్‌ఛాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు నూజివీడు ట్రిపుల్‌ఐటీకి ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి రెండేసి బాధ్యతలు నిర్వర్తిస్తుండటంపై ఆర్జీయూకేటీ వర్గాల్లోనే కాకుండా మేధావుల్లో, విద్యావంతుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్‌కు పరిపాలనకు సంబంధించిన బాధ్యతలను అదనంగా అప్పగిస్తుండటంతో వారు విద్యార్థులకు పాఠాలు చెప్పే అవకాశం లేకుండా పోతోంది. దీనివల్ల విద్యార్థులకు విద్యాపరంగా తీరని నష్టం వాటిల్లుతోందన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా ఇన్‌చార్జులు కావడంతో పరిపాలనకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకొని అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందనే అభిప్రాయం యూనివర్సిటీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. గతంలో డైరెక్టర్‌లను ఇతర యూనివర్సిటీల నుంచి ఐఐటీల నుంచి తీసుకువచ్చి నియమించేవారు. ఇప్పటికై నా రెగ్యులర్ డైరెక్టర్‌లను నియమించాల్సిన అవసరం ఉంది.


