● రోడ్డు ప్రమాదానికి గురై వృద్ధుడి మృతి
● లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై ఘటన
ద్వారకాతిరుమల: పొలం దారి వివాదాన్ని ఏఎంసీ చైర్మన్‌తో మాట్లాడి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై వెళుతున్న ఓ వృద్ధుడు రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం 8.45 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన పొనుకుమాటి మోహన్‌రావు(62)కు మండలంలోని జి.కొత్తపల్లిలో పొలం ఉంది. ఆ పొలానికి సంబంధించిన దారి విషయమై మాట్లాడేందుకు ఆయన నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన గోపాలపురం ఏఎంసీ చైర్మన్ బ్రహ్మరాజు వద్దకు వెళ్లారు. మాట్లాడిన అనంతరం తిరిగి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి, భీమడోలు వైపు నుంచి నల్లజర్ల వైపునకు వెళ్తున్న వ్యాన్ ఆయన బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యాన్ ఆయనపై నుంచి వెళ్లడంతో మోహన్‌న్‌రావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. నల్లజర్లకు చెందిన వ్యాన్ డ్రైవర్ పులి మురళీకృష్ణ వాహనాన్ని అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లింగపాలెం మండలం కాఠంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మృతుడి కుమారుడు పవన్‌న్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉంటే మృతుడు మోహన్‌న్‌రావు రాంగ్ రూట్‌లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.


